Hockey Jersey Row: బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగబోయే 2026 ఎఫ్‌ఐహెచ్ (FIH) హాకీ ప్రపంచకప్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ప్రపంచంలోని టాప్ 16 జట్లను ఎదుర్కొనేందుకు మనవాళ్లు వేసే వ్యూహాలు, వేసే గోల్స్ సంగతి పక్కన పెడితే.. ఆటగాళ్లు తొడుక్కునే చొక్కాల (జెర్సీల) చుట్టూ జరుగుతున్న వివాదాన్ని చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దశాబ్దాలుగా ఆడుతున్న ఐకానిక్ నీలం రంగు (Blue) చొక్కాను తీసి మూలన పడేసి, కాషాయం (Saffron) రంగులోకి మారిన వేళ.. హాకీ ఇండియా విడుదల చేసిన డిజైన్ పై తీవ్ర వివాదం కొనసాగుతుంది.
ప్రతీ కుట్టులో వేదాంతం:
సోషల్ మీడియాలో ఈ జెర్సీని ప్రమోట్ చేసిన తీరు చూస్తే, ఇది కేవలం ఆటగాళ్లు చెమట తుడ్చుకునే ప్లెయిన్ టి-షర్ట్ కాదు.. అచ్చంగా ఒక దైవిక కవచం ఏమో అనిపిస్తుంది. ప్రతీ కుట్టు ఒక కథ చెబుతుంది, ప్రతీ రంగు భారత ఆత్మగౌరవాన్ని మోస్తుంది అంటూ హాకీ ఇండియా ఇచ్చిన ఎమోషనల్ టచ్ వెనుక ఉన్న అసలు విశేషాలు ఇవే..
* కాషాయ రంగు ఎలివేషన్: ఇది కేవలం ఒక కలర్ కాదండోయ్! ఇది ధైర్యం, త్యాగం, ఉదయించే సూర్యుడు, కొత్త ఆశలకు ప్రతీకట. అంటే ఇన్నాళ్లూ బ్లూ జెర్సీలో ఆడినప్పుడు మన జట్టుకు ఈ ధైర్యం, ఆశలు కొద్దిగా తక్కువయ్యాయని హాకీ ఇండియా భావిస్తుందేమో!
* మండల ఆర్ట్ మెరుపులు: మైదానంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ప్లేయర్ల షర్టులపై మన ప్రాచీన మండల కళాత్మక ప్రింట్లు వేశారు. సాదాసీదా పాలిస్టర్ గుడ్డపై ఉన్న ఈ డిజైన్లను చూసి ప్రత్యర్థి డిఫెండర్లు మంత్రముగ్ధులైపోయి, బంతిని వదిలేసి సెల్యూట్ చేస్తారని ఆశిస్తున్నారు.
* సుదర్శన చక్రం: జెర్సీ సరిగ్గా ఛాతీ భాగంలో మోడర్న్ డిజైన్‌తో కూడిన సుదర్శన చక్రం వేశారు. ఇది వేగానికి, ఐక్యతకు, బలానికి సంకేతమట. మైదానంలో హాకీ స్టిక్‌తో గోల్ కొట్టడం కష్టమైతే, నేరుగా ఈ సుదర్శన చక్రాన్నే ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు విసిరేసే సదుపాయం ఏమైనా ఉందేమో చూడాలి.
ALSO READ : కాషాయ జెర్సీపై సోషల్ మీడియా దుమారం
* దేవనాగరిలో భారత్: షర్టుపై ఎంతో ముచ్చటగా దేవనాగరి లిపిలో "భారత్ (भारत)" అని రాశారు. ఈ అక్షరాలు చూడగానే ఆటగాళ్లలో దేశభక్తి వెల్లువెత్తి, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పాస్‌లు ఇచ్చేసుకుంటారని భావిస్తున్నారు.
* భుజాలపై త్రివర్ణ పతకాలు: భుజాల వెంట మన జాతీయ జెండా రంగుల బోర్డర్లు, దాంతో పాటే థింక్ ఇండియా.. థింక్ ఒడిశా బ్రాండింగ్.. కల్చర్, నేషనలిజం, స్పాన్సర్‌షిప్.. మూడింటినీ ఒకే షర్టుపై ఇంత పర్ఫెక్ట్‌గా సరిపెట్టడం ఒక్క హాకీ ఇండియాకే సాధ్యం.
థింక్ ఇండియా.. థింక్ ఒడిశా బ్రాండింగ్:
భారత హాకీ పునరుద్ధరణలో అగ్రతాంబూలం వహించిన ఒడిశా రాష్ట్ర సేవలను గుర్తిస్తూ, జెర్సీపై "Think India, Think Odisha" బ్రాండింగ్‌ను కొనసాగించారు. ఏళ్లుగా భారత హాకీకి ప్రధాన స్పాన్సర్ గా ఉంటూ, అనేక అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యమిచ్చి క్రీడను పరుగులు తీయించడంలో ఒడిశా పోషించిన పాత్రను ఈ సందర్భంగా గౌరవించారు. సరికొత్త విజువల్ మేకోవర్‌తో, సరికొత్త ఉత్సాహంతో ప్రపంచకప్‌లో అడుగు పెడుతున్న మన భారత హాకీ జట్టు, ఈ కాషాయ జెర్సీలో మైదానంలో అద్భుతాలు సృష్టించి దేశానికి మరో ప్రపంచకప్ ట్రోఫీని అందిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Presenting the new India jersey! 🇮🇳
— Hockey India (@TheHockeyIndia) July 27, 2026
Every stitch tells a story. Every pattern, every colour carries India's pride.
Our teams are ready to once again do the country proud at the FIH Hockey World Cup Belgium & Netherlands 2026.
🎥: Select 2 (SD+HD)+ Khel & JioHotstar
🗓️: August… pic.twitter.com/8GvwbByapq
