Hockey India Jersey Row: 2026 ఎఫ్‌ఐహెచ్ (FIH) ప్రపంచకప్‌కు కొద్దిరోజుల ముందు భారత హాకీ జట్టు సంప్రదాయ బ్లూ జెర్సీని పక్కనపెట్టి కాషాయ రంగులోకి మారడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపింది. దశాబ్దాలుగా మన క్రీడా సంస్కృతిలో భాగమైన నీలం రంగును ఒక్కసారిగా తుడిచి పెట్టేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరికి హాకీ ఇండియా సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్లూ సింథటిక్ పిచ్‌పై బ్లూ డ్రెస్ స్పష్టంగా కనిపించడం లేదంటూ ఒక సాంకేతిక సాకును తెరపైకి తెచ్చినప్పటికీ, దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ క్రీడకు బ్రాండ్ ఐడెంటిటీ కంటే పిచ్ రంగు మైండ్ గేమే ముఖ్యమైపోయిందా?.. అసలు ఒకేసారి మొదటి జెర్సీ రంగునే మార్చాల్సిన అత్యవసరం ఏమొచ్చింది? అనే విమర్శలు క్రీడా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
బ్లూ మైదానంలో బ్లూ డ్రెస్: టెక్నికల్ సమస్యే ప్రధాన కారణం:
హాకీ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిర్ణయం వెనుక ఎలాంటి ఇతర కారణాలు లేవు, కేవలం మైదానంలో టెక్నికల్ పరంగా తలెత్తుతున్న సమస్యల వల్లే రంగును మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ టోర్నీల్లో ఎక్కువగా బ్లూ సింథటిక్ టర్ఫ్ (Blue Synthetic Pitch) ఉపయోగిస్తున్నారు. ప్లేయర్స్ కూడా బ్లూ రంగు జెర్సీ ధరించడంతో గ్రౌండ్ లో ప్లేయర్లు స్పష్టంగా కనిపించక విజిబిలిటీ (Visibility) సమస్యలు ఎదురవుతున్నాయని కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లు గమనించారు.
కాషాయం ఎందుకు సెలక్ట్ చేశారు:
బ్లూ కలర్‌కి ప్రత్యామ్నాయంగా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది పసుపు లేదా కాషాయ రంగులను సూచించారు. మన జాతీయ పతాకంలో భాగమైన కాషాయం ధైర్యం, త్యాగం, జాతీయ ఆత్మగౌరవానికి సంకేతంగా నిలుస్తుందని హాకీ ఇండియా వెల్లడించింది. భారత హాకీ చరిత్రలో జెర్సీ రంగులు మారడం ఇదే మొదటిసారి కాదన్నారు. 2014 ప్రపంచకప్‌లో భారత జట్టు పసుపు (Yellow) రంగు జెర్సీని, 2018 ప్రపంచకప్‌లో స్కై బ్లూ (Sky Blue) జెర్సీని ధరించినట్లు హాకీ ఇండియా ఈ సందర్భంగా తెలియజేసింది.
ఇది రాజకీయ వివాదం కాదు.. మన వారసత్వం: వీరేన్ రస్కిన్హా
జెర్సీ మార్పుపై మొదట ప్రశ్నలు గుప్పించిన భారత మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా, తన పోస్ట్‌పై వస్తున్న రాజకీయ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నా పోస్ట్‌కి అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారు. నా ఆందోళన అంతా భారత హాకీ జట్టు ఆత్మగౌరవం, వారసత్వ గుర్తింపు గురించే.. ఫుట్‌బాల్ ప్రపంచంలో అర్జెంటీనా జట్టుకు ఎలాంటి ప్రాముఖ్యత ఉందో, హాకీలో భారత్‌కు అలాంటి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పుడైనా అర్జెంటీనా తన మొదటి జెర్సీగా ఆరెంజ్-వైట్ కలర్‌ను మార్చడం మనం చూడగలమా? అని ఆయన ఎక్స్ (Twitter) వేదికగా ప్రశ్నించారు.
#WATCH | Bhubaneswar, Odisha: On Hockey India changed national team jerseys from blue to saffron, Hockey India President Dilip Kumar Tirkey says, "The World Cup for both men and women is set to begin on August 15th in the Netherlands and Belgium. Ahead of this, Team India's… pic.twitter.com/1ym2HXSvVp
— ANI (@ANI) July 30, 2026
