V6 News

ప్రపంచాన్ని కరువులోకి నెట్టేసే ఎల్ నినో.. 27 ఏండ్లకు ఒకసారి వస్తుంది.. ఈ సారి పరిస్థితి ఏంటి..?

ప్రపంచాన్ని కరువులోకి నెట్టేసే ఎల్ నినో.. 27 ఏండ్లకు ఒకసారి వస్తుంది.. ఈ సారి పరిస్థితి ఏంటి..?

భారత  వాతావరణశాఖ  అంచనా  ప్రకారం ఈ సంవత్సరం  దేశవ్యాప్తంగా  నైరుతి  రుతుపవన కాలంలో  కురిసే వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.  ప్రస్తుతం భూమధ్యరేఖ వద్ద  పసిఫిక్  మహా సముద్రంలో  కొనసాగుతున్న  బలహీనమైన లానినా లాంటి  పరిస్థితుల నుంచి  ఎల్​నినో – దక్షిణ డోలనం (ఈఎన్ఎస్ఓ) తటస్థ  పరిస్థితులుగా పరివర్తన చెందుతున్నాయి.  ఆ తర్వాత నైరుతి రుతుపవన కాలంలో  ఎల్​నినో  పరిస్థితులు  ఏర్పడే  అవకాశం ఉంది.  ఈ  వాతావరణ అంచనా దేశ రైతాంగాన్ని  కొంతమేరకు  భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

దేశంలో  నికర సాగు విస్తీర్ణంలో సుమారు 51 శాతం,  మొత్తం ఆహార ఉత్పత్తిలో దాదాపు 40 శాతం  వర్షపాతం మీదనే  ఆధారపడుతుంది.  ఈ తరుణంలో  ఎల్​నినో,  లానినా  గురించి సరైన అవగాహన,  ప్రతికూల ప్రభావాలను  ఎదుర్కోవడానికి సన్నాహాలు  తెలుసుకోవడం చాలా అవసరం. 

ఎల్​నినో,  లానినా అంటే...

సాధారణ  పరిస్థితులలో  పసిఫిక్  మహా  సముద్రంలోని  వ్యాపార  పవనాలు  భూమధ్యరేఖ  వెంబడి  పశ్చిమం వైపు వీస్తూ,  దక్షిణ అమెరికా నుంచి వెచ్చని నీటిని ఆసియా వైపుకు  తీసుకువెళ్తాయి.  ఆ వెచ్చని నీటి స్థానంలో, సముద్రపు  లోతుల నుంచి  చల్లని నీరు పైకి  వస్తుంది.  ఇది  సాధారణ  గాలి తరంగాలు,  సముద్ర  ప్రవాహాల వల్ల  ఏర్పడే పరిస్థితులు.   అయితే,  మధ్య,  తూర్పు భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌‌‌‌ సముద్రలోని ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు ఏర్పడడం వల్ల  ఎల్ నినో– దక్షిణ డోలనం  ఏర్పడుతుంది.  దీనికి  ఎల్​నినో,  లానినా,  తటస్థం అనే మూడు దశలు ఉన్నాయి.  

ఎల్ నినో  అనేది  ఎల్​నినో– దక్షిణ డోలనం  చక్రంలోని  వేడెక్కే  దశను  సూచిస్తుంది.  ఈ దశలో  మధ్య,   తూర్పు పసిఫిక్‌‌‌‌లో  సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు  సాధారణ స్థాయుల కంటే  పెరుగుతాయి.  బలహీనమైన  వాణిజ్య పవనాలు  వెచ్చని నీటిని  దక్షిణ  అమెరికా వైపు కదలడానికి  అనుమతిస్తాయి.  లానినా అనేది  ఎల్​నినో – దక్షిణ డోలన  చక్రంలోని  శీతలీకరణ దశ.   లానినా  సమయంలో,  మధ్య,  తూర్పు పసిఫిక్‌‌‌‌లో   సముద్ర ఉపరితల  ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే తక్కువకు  పడిపోతాయి.  

సాధారణ వాడుక భాషలో చెప్పాలంటే సముద్ర ఉష్ణోగ్రత సాధారణం కంటే వేడిగా ఉంటే దాన్ని ఎల్​నినో  అని చల్లగా ఉంటే దాన్ని  లానినా,  వీటి రెండిటికి మధ్యలో ఉంటే దానిని తటస్థం  అంటారు.  ఎల్​నినో,   లానినా అనేవి  సముద్ర  సంబంధమైన  అంశాలు కాగా,  ఎల్​నినో  – దక్షిణ డోలనం  అనేది  వాతావరణ  సంబంధమైన అంశం. 

  • 27 సంవత్సరాలకు ఒకసారి...

ఎల్​నినో – దక్షిణ డోలనం 2-7 సంవత్సరాలకు  ఒకసారి  క్రమరహిత  చక్రాలలో  సంభవిస్తుంది.  ఎల్ నినో,  లానినా దశలు  సాధారణంగా  9 నుంచి 12 నెలలపాటు  కొనసాగుతాయి.  కానీ,  కొన్నిసార్లు  సంవత్సరాలపాటు కూడా ఉండవచ్చు.  ఆధునిక వాతావరణ రికార్డుల ప్రకారం (1882 నుంచి) ఎల్​నినో – దక్షిణ  డోలనం చక్రంలో  అత్యంత సుదీర్ఘ కాలం  కొనసాగినది 1990–-1995 కాలంలో  ఏర్పడ్డ ఎల్​నినో.  ఇది సుమారు 5  సంవత్సరాల 8 నెలలపాటు కొనసాగి  అత్యంత  సుదీర్ఘమైనదిగా రికార్డులలో  నిలిచింది.  

తర్వాత 2014-–2016 నాటి  ఎల్​నినో   సుమారు 19 నెలల పాటు కొనసాగింది.  అత్యంత సుదీర్ఘమైన లానినా 1973-–1976,  1998-–2001, 2020-– 2023 సంవత్సరాలలో  నమోదయ్యాయి.  ఈ సందర్భాల్లో  లానినా పరిస్థితులు సుమారు 33 నెలలపాటు కొనసాగాయి.  ఎల్​నినో  (వెచ్చని సముద్రం) వల్ల ఆసియా/దక్షిణ  అమెరికాలో  పొడి వాతావరణం ఏర్పడుతుంది. లానినా (చల్లని సముద్రం) వల్ల  ఆసియా/ ఆస్ట్రేలియాలో  తేమ వాతావరణం  ఏర్పడుతుంది.  ఈ  రెండు దశలు  మారుతూ  ప్రపంచ ఉష్ణోగ్రత,  వర్షపాతం,  తీవ్రమైన వాతావరణ  మార్పులకు  కారణమవుతాయి.  ప్రధానంగా  ఎల్​నినో  సమయంలో  తరచుగా  ప్రపంచ ఉష్ణోగ్రతలను పెరిగి,  ప్రపంచవ్యాప్తంగా వరదలు  లేదా  కరువులకు దారితీస్తుంది. 

  • స్పానిష్ భాషలో  ‘చిన్న బాలుడు, చిన్న బాలిక’

ఎల్​నినోను  మొదట 1600వ దశకంలో దక్షిణ అమెరికా మత్స్యకారులు.. పెరూ తీరంలో సంభవించే ఒక అసాధారణమైన వెచ్చని సముద్ర ప్రవాహంగా గుర్తించారు.  ఈ వెచ్చని నీటి ప్రవాహాలు సంభవించే సమయాన్ని (సుమారు డిసెంబర్ నెలలో) బట్టి  దీనికి ఆ పేరు ( స్పానిష్ భాషలో దీని అర్థం చిన్న బాలుడు లేదా క్రీస్తు శిశువు) పెట్టారు.  ఇక  లానినా అంటే 'చిన్న బాలిక' అని అర్థం.   ఇరవైయ్యవ శతాబ్ద కాలంలో  ఎల్ నినో  కేవలం ఒక ఉష్ణమండల  తీరప్రాంత  ప్రవాహం  మాత్రమే కాదని,  ప్రపంచవ్యాప్తంగా వాతావరణ  సరళిని  ప్రభావితం చేస్తుందని  గుర్తించడం జరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా ఎల్​నినో –దక్షిణ డోలనంతో  ముడిపడిఉన్న  కొన్ని తీవ్రమైన ఆహార సంక్షోభ సంఘటనలు చేస్తే. 1982–84 ఏర్పడ్డ  ఎల్​నినోతో  హార్న్ ఆఫ్ ఆఫ్రికా,  సాహెల్ ప్రాంతాలలోని కరువు ఏర్పడి ఆహార సంక్షోభానికి దారితీసింది.  దక్షిణ ఆఫ్రికాలో 1991–-1992 మధ్య  ఏర్పడ్డ  ఎల్​నినో  వల్ల  దాదాపు 100  మిలియన్ల  ప్రజలను  ప్రభావితం చేసింది.  పెరూలో 1997–-1998  ఎల్​నినో  సమయంలో  పుట్టిన  పిల్లపై  ఆరోగ్యంపై అనేక ప్రతికూల  ప్రభావాలను  చూపాయి.  అదేవిధంగా  2020–23లో  సంభవించిన 'ట్రిపుల్  డిప్  లానినా' వల్ల  ఇథియోపియా, కెన్యా,  సోమాలియాలో వరుసగా 3 సంవత్సరాలపాటు కరువుకు దారితీసింది.  దీనివల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారు.   ఎల్​నినో –దక్షిణ డోలనం పరిస్థితులు మన దేశంలో  పంటల ఉత్పత్తి,  మత్స్య పరిశ్రమ,  ఆక్వాకల్చర్‌‌‌‌పై   ప్రతికూల  ప్రభావాలను చూపుతాయి. 

  • కరువు పరిస్థితులు 

 మన దేశంలో 1950 నుంచి  నేటివరకు 16 ఎల్​నినో   సంవత్సరాలు ఉండగా  వాటిలో  7 సంవత్సరాలు వర్షపాతం  సాధారణం కంటే తక్కువగా నమోదై  మన రుతుపవన వర్షపాతంపై  ప్రభావం చూపాయి.   ఎల్ నినో  సంఘటనల  సమయంలో  రుతుపవనాలు విఫలమవడం  వల్ల భారతదేశంలో తీవ్రమైన కరువులు సంభవిస్తాయి. 1986–-1988,  1991–-92, 2002–-03,  2024-–16లో  ఏర్పడ్డ  ఎల్​నినో   వల్ల  మన దేశంలో  కరువు  పరిస్థితులు  ఏర్పడ్డాయి. అంతేకాకుండా,  ఉష్ణోగ్రత,  వర్షపాతం, తేమలో హెచ్చుతగ్గులు వల్ల పంటలకు నూతన చీడపీడలు సంక్రమించడం, వాటి ఉధృతి  పెరగడం జరుగుతుంది.  

ఈ నేపథ్యంలో ఎల్ నినో– దక్షిణ డోలనం  పరిస్థితులను  సమర్థవంతంగా  ఎదుర్కోవడానికి వాటికి సంబంధించిన సమాచారం సకాలంలో చేరవేయండం ఎంతో ముఖ్యం.  మన దేశంలో వాతావణ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందించడానికి భారత వాతావరణ శాఖ...  గ్రామీణ కృషి మౌసమ్ సేవ పేరిట ఒక క్రియాశీలక  'వ్యవసాయ వాతావరణ సలహా సేవలను' నిర్వహిస్తోంది.  ఈ పథకం కింద  రాబోయే  ఐదు రోజులపాటు జిల్లా,  బ్లాక్ స్థాయిలలో మధ్యకాలిక  వాతావరణ  సూచనలు  రూపొందిస్తారు.  

- డా. రేపల్లె నాగన్న 

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.