ప్రైవేట్ స్కూళ్లల్లో, కళాశాలల్లో పరుగెత్తే ఫీజుల మోత, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు తల్లడిల్లే రోజులు నేడు సమాజంలో కనపడుతున్నాయి. వాస్తవానికి అడ్మిషన్ల కోసం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక పాఠశాలల్లో, ఇంటర్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేశాక ప్రవేశాలు తీసుకోవాలి. అంతవరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. అడ్మిషన్లు తీసుకోవద్దు. కానీ పాఠశాలల వారు, ఇంటర్ కళాశాలల వారు నిబం ధనలను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు అడ్డగోలు ప్రచారానికి తెరలేపుతున్నాయి. అడ్మిషన్లు ప్రారంభమంటూ, అనుమతి లేని ప్రాంతాలల్లో విద్యాసంస్థల నిర్వహణ పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో , కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నా అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం లేదు.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో ముందస్తు ప్రవేశాలు తీసుకున్న విద్యార్థుల్లో కనీసం 30 శాతం మంది పరిసరాలకు అలవాటు పడలేక అనారోగ్యం పాలవడంతో తిరిగొచ్చే సందర్భాలు ఉంటాయి. ఏ కారణం అయినా మానేసినా ఫీజు తిరిగి తెచ్చుకునేందుకు చుక్కలు చూడాల్సిందే. కొంత ట్యూషన్ ఫీజు, కొంత హాస్టల్ ఫీజు తగ్గించి మిగతా డబ్బులు ఇస్తామని అవి కూడా వాయిదా పద్ధతిలో ఇస్తామని చెపుతారు. ఇక అడ్మిషన్ ఫీజు మొత్తాన్ని మర్చిపోవాల్సిందే.
- భారీగా ఫీజుల వసూళ్లు..
ప్రస్తుత సంవత్సరం ఉన్న ఫీజుల కంటే వచ్చే విద్యా సంవత్సరం ఫీజులు ఒక్కో పాఠశాల కళాశాల వారు 15 నుంచి 20% ఫీజులు పెంచారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు. పాఠ శాలల్లో ఎల్కేజీ, యూకేజీకే లక్ష రూపాయల పైన ఫీజు, అడ్మిషన్ ఫీజు 20 వేలు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలల్లోనే పుస్తకాలు యూనిఫామ్స్ ఇతర స్టేషనరీ వస్తువుల పేరిట లక్ష వరకు దండుకుంటున్నారు. ఇంటర్ కళాశాలలు సైతం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ ఫీజులు కళాశాలలో పుస్తకాలు వారే అమ్ముతూ దోపిడీ చేస్తున్నారు. ఎంపీసీ ,బైపిసి (ఐఐటీ, నీట్) పేరుతో ఏడాదికి డే స్కాలర్ విద్యార్థికి రూ.90 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఫీజులు నిర్ణయించారు.
మాదాపూర్ ప్రాంతాల క్యాంపస్లకు రూ. 2–3 లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక గ్రూప్ విద్యార్థులు ప్రత్యేక క్యాంపస్ హాస్టల్ అని చదువుకోదలిస్తే ఒక్క సంవత్సరానికే రూ.2.50,000 నుంచి 3లక్షల వరకు ఖర్చవుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లో రెండు సంవత్సరాల ప్యాకేజ్ పేరుతో 6 లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వైనం. సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూప్ సివిల్స్ పౌండేషన్ పేరుతో కొత్త కోర్సును పరిచయం చేస్తూ సుమారు రూ.1.65 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. సీఈసీ, ఎంఈసీ గ్రూప్స్ సీఏ, ఇతర పేర్లు జోడించి రూ.2. లక్షలకుపైనే డిమాండ్ చేస్తున్నారు.
- కట్టడి చేయాలి
కార్పొరేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న విద్య దోపిడీని అరికట్టాలి. ఫీజులను నియంత్రణ చేస్తామని పాలకులు చట్టసభల్లో మాట్లాడటమే తప్ప ఫీజు నియంత్రణ చట్టాలు అమలు చేయించడంలో విఫలం అవుతున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న నేపథ్యంలో ఫీజు నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేసేలా ఈ విద్యాసంవత్సరం నుంచైనా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాఠశాలలను , కళాశాలలను తనిఖీ చేసి వారి సౌకర్యాలు, వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు తెలుసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను, కళాశాలలను సీజ్ చేయాలి. అధికారులు ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- కసిరెడ్డి మణికంఠ రెడ్డి,
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.

