ఫెస్టివల్‌ సేల్స్‌ 31వేల కోట్లు

ఫెస్టివల్‌ సేల్స్‌  31వేల కోట్లు

ఫ్లిప్‌కార్ట్‌ ఆర్డర్‌ సగటు
విలువ రూ.1,976
అమెజాన్‌ సగటు ఆర్డర్
విలువ రూ.1,461
గత ఏడాదితో పోలిస్తే
అమ్మకాలు 60% పెరుగుదల

బెంగళూరుఈ ఏడాది దసరా, దీపావళి పండగలను అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ బాగానే సొమ్ముచేసుకున్నాయి. ఈ రెండు ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలు గతనెల 15 రోజులపాటు ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ నిర్వహించి రూ.31 వేల కోట్ల (4.3 బిలియన్లు) విలువైన వస్తువులను అమ్మాయి. వీటికి ఈసారి ఐదు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.39 వేల కోట్లు) విలువైన ఆర్డర్లు వస్తాయన్న ఎనలిస్టుల అంచనాలు నిజం కాలేదని రెడ్‌‌–సీర్‌‌ కన్సల్టింగ్‌‌ కంపెనీ రిపోర్టు తెలిపింది. ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఆర్డర్‌‌ సగటు విలువ రూ.1,976 కాగా, అమెజాన్‌‌ సగటు ఆర్డర్ విలువ రూ.1,461లుగా రికార్డయింది. వీటిని బట్టి చూస్తే కస్టమర్లు ఖరీదైన వస్తువుల కొనుగోలుకు ఫ్లిప్‌‌కార్ట్‌‌ను ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. మొత్తం స్థూల అమ్మకాల్లో ఫ్లిప్‌‌కార్ట్‌‌ వాటా 64 శాతం ఉంది. నెట్‌‌ ప్రమోటర్‌‌ స్కోర్‌‌ (ఎన్‌‌పీఎస్‌‌) విషయంలో మాత్రం అమెజాన్‌‌ పైచేయి సాధించింది. కస్టమర్‌‌ లాయల్టీని (తరచూ కొనేవాళ్లు) ఎన్‌‌పీఎస్‌‌ ద్వారా అంచనా వేస్తారు. అయితే ఈ రిపోర్టు రహస్యమైనది కాబట్టి దీని గురించి స్పందించలేమని రెడ్‌‌సీర్‌‌ తెలిపింది. స్థూల అమ్మకాలు లేదా గ్రాస్‌‌ మెర్చండైజ్‌‌ వాల్యూ (జీఎంవీ) విషయంలోనూ ఎనలిస్టుల అంచనాలు నిజం కాలేదు. ఈ రెండు కంపెనీలు ఫెస్టివల్‌‌ సేల్స్ ద్వారా ఐదు బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధిస్తాయని అనుకున్నా, 14 శాతం తక్కువగా నమోదయ్యాయి.

ఎన్ని యూనిట్లు అమ్మారంటే..

షిప్‌‌ అయిన గ్రాస్‌‌ యూనిట్ల ప్రకారం చూస్తే ఈ రెండు కంపెనీల మధ్య భారీ తేడా కనిపించడం లేదు. ఈ విషయంలో ఫ్లిప్‌‌కార్ట్‌‌ వాటా 56 శాతం కాగా, అమెజాన్‌‌ వాటా 44 శాతానికి చేరింది. ఎలక్ట్రానిక్‌‌, ఫ్యాషన్‌‌ బ్రాండ్లు ఎక్కువగా ఉండటం వల్ల అమెజాన్‌‌ ఎన్‌‌పీఎస్‌‌ బాగా పెరిగింది. చిన్న నగరాల్లో ఎక్కువ ఆదరణ ఉండటం ఫ్లిప్‌‌కార్ట్‌‌కు కలిసొచ్చింది. ఆర్డర్ల క్యాన్సిలేషన్‌‌ అమెజాన్‌‌లో చాలా తక్కువ ఉంది. మెట్రో నగరాల్లో మాత్రం రెండు కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతుండగా, అమెజాన్‌‌ అమ్మకాలు ఒకశాతం ఎక్కువగా ఉన్నాయి. ఒకే కస్టమర్‌‌ నుంచి ఆర్డర్లు ఎక్కువ రావడం ఇందుకు కారణం. ఇండియాలో కొత్త డిజిటల్‌‌ ఎకానమీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని అమెజాన్‌‌ ఇండియా కంట్రీహెడ్‌‌ అమిత్‌‌ అగర్వాల్‌‌ అన్నారు. ఫెస్టివల్‌‌ సేల్స్‌‌లో తమ అంచనాలకు మించి ఆర్డర్లు వచ్చాయని ఫ్లిప్‌‌కార్ట్‌‌ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి అమ్మిన యూనిట్ల సంఖ్య 60 శాతం పెరిగి 11 కోట్లకు చేరింది. సగటు అమ్మకపు ధర 23 శాతం పెరిగి రూ.1,680కి ఎగబాకింది. మరో ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీ స్నాప్‌‌డీల్‌‌ జీఎంవీ రూ.164 కోట్లకు చేరింది.

నిజంగా పండగే

ఇండియాలో పండగల సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు కొత్త వస్తువులు కొనడం ఆనవాయితీ. ముఖ్యంగా దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఈ రెండు కంపెనీలు ప్రత్యేక సేల్స్‌‌ పెట్టి, భారీగా డిస్కౌంట్లు ఇచ్చి అమ్మకాలను విపరీతంగా పెంచుకున్నాయి. అయితే అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ అక్రమంగా ధరలను తగ్గించి, అడ్డగోలుగా డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని చిన్న వ్యాపారుల నుంచి విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక విధానాన్ని తీసుకొచ్చింది.

ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలు సొంతంగా వస్తువులు అమ్మకూడదని, పరిమితికి మించి డిస్కౌంట్లు ఇవ్వకూడదని ఆదేశించింది. అయినప్పటికీ అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ల అమ్మకాలు, డిస్కౌంట్లు తగ్గకపోవడం గమనార్హం.  అంతేకాదు, మన ఎకానమీ కొద్దిగా నెమ్మదించినప్పటికీ, తమ వ్యాపారాలపై ఎటువంటి ప్రభావమూ లేవని ఇవి స్పష్టం చేశాయి. రెడ్‌‌సీర్‌‌ వాదన మాత్రం వేరుగా ఉంది. ఇంటర్నెట్‌‌ మార్కెట్‌‌ పెరుగుదల నెమ్మదించిందని తెలిపింది.