
వెలుగు బిజినెస్ డెస్క్: పండుగల సీజన్ రావడానికి తోడు ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం మార్కెట్లో భారీ సందడి కనిపిస్తోంది. పసిడి రేటు మరింత పెరగవచ్చనే అంచనాల కారణంగా చాలామంది పెట్టుబడుల కోసం కూడా బంగారాన్ని కొంటున్నారు. ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.1.32 లక్షల పైమాటే! ఇంత విలువైన లోహాన్ని కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు చేసేటప్పుడు ఎమోషన్లను పట్టించుకోవద్దు. నమ్మకమైన రిటైలర్ నుంచి జాగ్రత్తగా, బాధ్యతగా బంగారం కొనుగోలు చేయాలి. పెట్టుబడి భద్రత, విలువను కాపాడుకునేందుకు ఈ ఐదు రూల్స్ పాటించండి.
సరైన సమయంలో కొనాలి
ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలుకు అత్యంత ముఖ్యమైన రోజు. చివరి నిమిషంలో ఉండే రద్దీ కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలను, రిటైల్ ఔట్లెట్లలోని పొడవైన క్యూలను తప్పించుకోవాలంటే, నగలను ముందే బుక్ చేసుకొని ధన్వంతరి రోజు డెలివరీ ఇవ్వాలని అడగవచ్చు. నాణేలు లేదా బార్ల కోసం ఎంసీఎక్స్ స్పాట్ ధరలను చెక్చేయాలి. రద్దీ తగ్గే వరకు చూసి, పండుగ తర్వాత డీల్స్ కోసం చూడొచ్చు.
సర్టిఫికేషన్, పారదర్శకత, నమ్మకం తప్పనిసరి
సరైన బంగారం కొనుగోలుకు నమ్మకం, పారదర్శకత ముఖ్యమైన అంశాలు. మీరు కొనే రిటైలర్ నగలను సరిగా వెరిఫై చేయాలి. బీఐఎస్ హాల్‌మార్క్ , ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించే ఆరు అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను అందిస్తేనే తీసుకోవాలి. పూర్తి డాక్యుమెంటేషన్ అడగడానికి వెనుకాడకూడదు. డీటెయిల్డ్ ఇన్వాయిస్, హామీ కార్డు, అసెస్మెంట్ రిపోర్ట్ కోరాలి. ఇన్వాయిస్లో బంగారు రేటు, తయారీ చార్జీలు, తరుగు (వేస్టేజ్), పన్నుల గురించి ఉందో లేదో చూడాలి. వివిధ రిటైలర్ల ధరలు పోల్చి చూడటానికి ఇది సహాయపడుతుంది. రిటర్న్ లేదా బైబ్యాక్ పాలసీలను అందించే వాళ్ల దగ్గర కొనడం బెటర్. ప్రతి దానిపై హాల్‌మార్క్ స్టాంప్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. తిరిగి అమ్మడానికి, బీమాకు ఇది చాలా కీలకం.
సరైన రిటైలర్ను ఎంచుకోవాలి
బంగారం కొనుగోలుదారులకు ఉన్న అతిపెద్ద ఆందోళనలలో ఒకటి - నమ్మకమై న రిటైలర్ దొరకడం. చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల, విశ్వసనీయత లేని ఔట్లెట్లలో తమ కష్టార్జితాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల దగ్గర కొంటే డబ్బుకు, దీర్ఘకాలిక రాబడికి ప్రమాదం. మీ పెట్టుబడిని రక్షించుకోవడానికి, ఎల్లప్పుడూ గుర్తింపు పొందిన రిటైలర్ దగ్గరికి వెళ్లాలి. బంగారం పరిశ్రమ రూపొందించిన పరిశ్రమ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం వ్యాపారం చేసే వారి దగ్గరే కొనాలి. బంగారం మూలం గురించి, అది ఎక్కడ నుంచి వచ్చింది, రిటైలర్ న్యాయమైన-వాణిజ్య (ఫెయిర్‌ట్రేడ్) సూత్రాలను పాటిస్తున్నాడో లేదో తెలుసుకోవాలి.
అవసరాన్ని బట్టి ఎంపిక
బంగారం కొనాలని నిర్ణయించుకున్నప్పుడు, మీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. నగల కోసమా, ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికా లేక పెట్టుబడి కోసమా అనేది తేల్చుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడికి, 24 క్యారెట్ల బంగారు నాణేలు, బార్‌లు మెరుగైన రీసేల్ విలువ ఉంటుంది. తయారీ చార్జీలు తక్కువగా ఉంటాయి. ఎమోషన్స్, సెంటిమెంట్‌తో కొంటే డిజైన్, తయారీ ఖర్చులు ఉంటాయి. ఇలాంటి వాటి విలువ కాలక్రమేణా తగ్గిపోవచ్చు.
రూ.2,500 తగ్గిన పసిడి ధర, కిలో వెండి ధర కూడా రూ.7,000 డౌన్
న్యూఢిల్లీ: ధంతేరాస్ సందర్భంగా కొనుగోలుదారులు నగల దుకాణాలకు పోటెత్తినప్పటికీ, ఢిల్లీ మార్కెట్లలో శనివారం బంగారం రూ. 2,400 తగ్గి రూ. 1,32,400 వద్ద స్థిరపడింది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 3,200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,34,800 తో అత్యధిక స్థాయికి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర సైతం రూ. 2,400 తగ్గి 10 గ్రాములకు రూ. 1,31,800కు పడిపోయింది.
గత ధంతేరాస్ (అక్టోబర్ 29, 2024) తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 51 వేలు, అంటే 62.65 శాతం పెరిగింది. వెండి ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గి కిలోకు రూ. 7,000 తగ్గి రూ. 1,70,000 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు వెండి ధర కిలోకు రూ. 1.77 లక్షలు పలికింది. గత ధంతేరాస్ తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ. 70,300, అంటే 70.51 శాతం పెరిగింది.
భారీ ధరల కారణంగా కొనుగోలుదారులు లాభాలను బుక్‌చేయడంతో ధరలు దిగివచ్చాయని వ్యాపారులు తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్లపై దృష్టి సారించడంతో ఈ ఏడాది రూ. లక్ష కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయని అంచనా. బంగారం, వెండి అమ్మకాల ద్వారానే రూ. 60 వేలు కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
బంగారం ధరల సంగతులు..
బంగారం ధరలు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. స్వచ్ఛత, లోహాలను కలపడం (అల్లాయ్కంపోజిషన్), చేతికూలీ ఆధారంగా అంతిమ ధరను లెక్కిస్తారు. ఇవి భవిష్యత్తు విలువను ప్రభావితం చేస్తాయని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి. 75 శాతం స్వచ్ఛత ఉన్న 18క్యారెట్ల బంగారం, సమకాలీన, తేలికపాటి డిజైన్లకు అనువైనది.
ఇది మన్నికైనది, సరసమైనది, రోజువారీగా ధరించడానికి బాగుంటుంది. 91.6 శాతం స్వచ్ఛత ఉన్న 22క్యారెట్ల బంగారం పెళ్లిళ్లు, పండుగ సందర్భాలకు అనువైనది. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న 24క్యారెట్ల బంగారం నగలకు సరిపోదు. నాణేలు, బార్‌లు, దీర్ఘకాలిక పెట్టుబడికి సరిగ్గా సరిపోతుంది. అల్లాయ్కంపోజిషన్ రూపం, మన్నికపైనే కాకుండా, రీసేల్ విలువపై కూడా ప్రభావం చూపుతుంది. క్యారేజ్ ఎక్కువైతే, రాబడీ ఎక్కువ వస్తుంది. బ్రాండ్ పేరు కూడా తయారీ చార్జీలపై గణనీయంగా ప్రభావం చూపుతాయి.