పండగపూట విషాదం.. చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

పండగపూట విషాదం.. చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

స్టీమర్ల ద్వారా గజ ఈతగాళ్లతో కొనసాగుతున్న గాలింపు
మంచిర్యాల జిల్లా: భీమరాం మండల కేంద్రంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం గొల్ల వాగు ప్రాజెక్టులోకి నాటు పడవ ద్వారా చేపలవేటకు వెళ్లిన అయిదుగురు వ్యక్తుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేయగా.. మరో ఇద్దరు రాలేకపోయారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా చీకటిపడడంతో బ్రేక్ పడింది. తెల్లవారక ముందే స్టీమర్లతో గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు ప్రారంభించారు. తెల్లవారిన తర్వాత గాలింపు మరింత ముమ్మరం చేశారు.
చేపల వేటకు వెళ్లిన బొంతల రమేష్, ఇరవేని రాజబాపు, రమేష్, సుంకరి సంపత్, రవి కలసి నాటు పడవ ద్వారా చేపల వేటకు వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో అందరూ నీటిలో పడిపోయారు. ముగ్గురు ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బొంతల రమేష్, ఇరవేన రాజబాపులు ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా.. చీకటి పడడంతో సహాయకచర్యలు నిలిపివేయాల్సి వచ్చింది. ఉదయం తెల్లవారిన వెంటనే భీమరాం ఎస్.ఐ సంజీవ్ ఆధ్వర్యంలో స్టీమర్ల ద్వారా గజ ఈత గాళ్లు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.. గల్లంతైన రమేష్ (40) కి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రాజబాపు కి భార్య వున్నారు. ఓ వైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. గల్లంతైన వారు బతికి ఉండే అవకాశం లేదంటూ ప్రాజెక్టు వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.