
- పేషెంట్లతో నిండిపోతున్న ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటళ్లు
- పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత
- ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితి
ఆసిఫాబాద్,వెలుగు: వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆసిఫాబాద్జిల్లాలోని పల్లె ప్రజలు, గిరిజనులు జ్వరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎక్కడ చూసినా ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటళ్లు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. వారం రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పీహెచ్ సీల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతుండడంతో పేషెంట్లు అరిగోస పడుతున్నారు. అపరిశుభ్రత, దోమలతో ప్రజలు సీజనల్వ్యాధుల బారిన పడుతున్నారు.
ప్రతీరోజు ఓపీ 650 వరకు..
జిల్లాలో 20 పీహెచ్ సీలు, 2 అర్బన్ పీహెచ్ సీలు, 5 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లో నిత్యం ఓపీ 600 నుంచి 650 వరకు ఉంటోంది. పల్లె, పట్టణం తేడా లేకుండా సీజనల్ వ్యాధులు పడగ విప్పాయి. జ్వరాలు, వాంతులు, విరేచనాలు, కీళ్ల నొప్పులతో వందలాది మంది జీజీహెచ్‌కు క్యూ కడుతున్నారు. రోజుకు 100 వరకు గ్లూకోజ్ బాటిళ్లు అవసరమవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు మలేరియా 10, డెంగ్యూ 2 కేసులు నమోదయ్యాయి. కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన రాయిపూర్ మన్విత(7)కు జ్వరం రాగా తల్లిదండ్రులు బుధవారం పీహెచ్‌సీకి తీసుకెళ్లి, చికిత్స అందించారు. సాయంత్రం పాపకు సిరప్తాగించి, పడుకోబెట్టగా మృతిచెందింది.
18 డాక్టర్ పోస్టులు ఖాళీ
జిల్లాలోని పీహెచ్ సీలు, అర్బన్ పీహెచ్ సీల్లో సరిపడా డాక్టర్లు లేరు. పీహెచ్ సీల్లో మొత్తం 45 మంది డాక్టర్లు ఉండాల్సిన ఉండగా 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్ఎంలు 202 మంది ఉండాలి. కానీ 139 మందే ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు 15 మందికి గానూ నలుగురు, ఫార్మసిస్టులు 15 మందికి గానూ నలుగురు, స్టాఫ్ నర్స్‌లు 43 మందికి గానూ 23 మంది ఉన్నారు. ఆశావర్కర్లు 803 మంది ఉండాలి. ఈ పోస్టులు 69 ఖాళీ ఉన్నాయి. నిత్యం ఒక్కో పీహెచ్ సీకి 50 నుంచి 60 మంది పేషెంట్లు వస్తున్నారు. డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్‌నర్స్‌లు, సిబ్బందే వైద్య సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల సౌకర్యాల లేకపోవడంతో అడ్మిట్ చేసుకోకుండా వేరే హాస్పిటల్ కు రెఫర్ చేస్తున్నారు.
సిబ్బందిని అప్రమత్తం చేశాం
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. వైద్యం సిబ్బందిని అప్రమత్తం చేశాం. జిల్లాలోని గూడేలు, తండాలతోపాటు పట్టణాల్లోనూ హెల్త్ క్యాంప్‌లు నిర్వహించేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నా అడ్జస్ట్ చేస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నాం. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని గవర్నమెంట్ దవాఖానకు వెళ్లి, ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కుమ్రం సీతారాం, డీఎంహెచ్ వో, ఆసిఫాబాద్