హైదరాబాద్, వెలుగు: దేశంలో అత్యంత కాలుష్యానికి గురైన నదుల్లో గోదావరి ప్రధానమైనదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అన్నారు. ఈ నది కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోందని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్‌కు సరఫరా అయ్యే తాగునీటిలో ఎక్కువ భాగం గోదావరి నుంచే వస్తుందని, బాసర నుంచి భద్రాచలం వరకు నది కాలుష్యం పెరిగిపోతుందని లేఖలో ఆయన పేర్కొన్నారు.
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ, ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలు చేసిన స్డడీలు గోదావరి నీటి నాణ్యత క్షీణిస్తున్నదని హెచ్చరికలు జారీ చేశాయని ఆయన గుర్తుచేశారు.
