హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో పోటీకి డబ్బు, కులం ప్రధాన అంశాలుగా మారాయని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.40 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ‘ఎన్నికలు – అభ్యర్థుల ఎంపిక’ అనే అంశంపై సోమవారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌కు జేపీ హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు పోటీ చేయకుండా ఎఫ్ జీజీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. “రాష్ట్రంలో ఎమ్మెల్యే చెబితేనే కేసుల నమోదు, తొలగింపు, విచారణ జరుగుతుంది. సాధారణ ప్రజలకు న్యాయం అందటం లేదు. చట్ట బద్ధ పాలన జరగాలి. ఎన్నికల వ్యవస్థ మారాలి. నేరం చేసిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలి. ప్రస్తుతం రాజకీయాల్లో 30 శాతం మంది నిజాయితీపరులు ఉన్నారు. అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు” అని చెప్పారు.
రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నరు: పద్మనాభయ్య
అభ్యర్థుల ఎంపికపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయని, సుప్రీం గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయని, కానీ పార్టీలు వాటిని ఉల్లంఘిస్తూ అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నాయని కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీ పద్మనాభయ్య అన్నారు. ఇలాంటి వాటిపై మనం లీగల్ గా ముందుకు వెళ్లొచ్చని తెలిపారు. నామినేషన్ టైమ్‌లో అభ్యర్థి తప్పుడు సమాచారం ఇస్తే ఈసీ రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల నామినేషన్‌ను తిరస్కరించాలన్నారు. ఎన్నికలు జరిగినప్పుడు వేరే ప్రాంతాల వారు వచ్చి ఓట్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, అయినా ఈసీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
నేరచరిత్ర అభ్యర్థుల వివరాలు ప్రజలకు చెప్పాలి: ఆకునూరు మురళి
అభ్యర్థుల నేర చరిత్ర గురించి ప్రజలకు చెప్పాలని, అప్పుడే పార్టీలు వెనుకడుగు వేస్తాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి అన్నారు. ‘‘జనగామ ఎమ్మెల్యే కబ్జాదారుడని కలెక్టర్ చెప్పారు. దీంతో ఆమెను బదిలీ చేశారు. ఇప్పుడు తన తండ్రి దొంగ అని ఆయన కూతురు కూడా చెప్పారు” అని అన్నారు. స్టడీ చేస్తే ఇంకా చాలా మంది దొంగలు కనిపిస్తారని చెప్పారు. ‘‘పార్టీ టికెట్ కోసం కోట్లు ఇస్తున్నారు.. పైసలు ఇచ్చి మంత్రి పదవులు కొనుక్కుంటున్నారు” అని మండిపడ్డారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ సిగ్గులేకుండా కొన్నాడని, ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని మురళి ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు అవుతున్నా స్పీకర్ అనర్హత వేటు వేయకుండా పక్కన పెడుతున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేస్తే..కోర్టుకు వెళ్లమని చెబుతున్నారని అన్నారు.