- ఓసీ కోటాలో రోహిన్ రెడ్డి, చామల, వంశీచంద్ రెడ్డి, పద్మావతి పేర్ల పరిశీలన
- బీసీ కోటాలో సరిత, విజయశాంతి
- ఎస్టీ కోటాలో బలరాం నాయక్
- మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పేర్లు
హైదరాబాద్, వెలుగు: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను ఈ నెలాఖరులోగా నియమిస్తామని పార్టీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటించడంతో ఆ పదవులు ఎవరిని వరిస్తాయోననే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ లో మొదలైంది. ఈ పోస్టు కోసం సీనియర్ నేతలు ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంటేనే తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ‘లక్కీ పోస్టు’ అనే సెంటిమెంట్ ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ పదవి చేపట్టిన వారు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండడమే ఇందుకు కారణం. పైగా పీసీసీ చీఫ్ పదవి తర్వాతి స్థాయి పదవి కూడా ఇదే కావడంతో సీనియర్ నేతలంతా ఈ పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. దీంతో ఈ పోస్టుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
మరోవైపు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఉత్తమ్, రేవంత్ పీసీసీ చీఫ్ లుగా ఉన్న సమయంలో కూడా ఇలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. దీంతో ఇప్పుడు కూడా నలుగురిని నియమించనున్నారనే సంకేతాలు ఢిల్లీ నుంచి పీసీసీకి అందాయి. ఓసీ కోటాలో రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం రేవంత్ సన్నిహితుడు, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ గా పనిచేసిన రోహిన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీరితోపాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇక బీసీ కోటాలో మంత్రివర్గంలో యాదవ, మున్నూరుకాపు సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం లేనందున ఈ రెండు సామాజికవర్గాల్లో ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోవడంపై పీసీసీ కసరత్తు చేస్తోంది. యాదవ కోటాలో గద్వాల మాజీ జడ్పీ చైర్ పర్సన్, గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచే పోటీ చేసిన సరితా యాదవ్ పేరును పీసీసీ పరిశీలిస్తోంది.
ఉత్తమ్ పద్మావతిని కాదనుకుంటే మహిళా కోటాలో సరితకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశిక్ కూడా యాదవ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారు. ఓయూ విద్యార్థి నేతగా పీసీసీలో ఆయనకు గుర్తింపు ఉంది. యాదవులకు కాకుండా మున్నూరుకాపులకు ఇవ్వాలనుకుంటే ఆ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతి పేరును పీసీసీ పరిశీలిస్తోంది.
బీసీకి వద్దనుకుంటే ఎస్సీ కోటాలో మల్లు రవి, సంపత్లో ఒకరికి చాన్స్
ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రచారంలో ఉంది. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక మైనారిటీ కోటాలో నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఫిరోజ్ ఖాన్ పేరు పరిశీలనలో ఉంది. బీసీ కోటాలో యాదవులకు, మున్నూరుకాపులకు చోటు లభించని పక్షంలో ఎస్సీ కోటా కింద ఒకరికి అవకాశం రావచ్చని పార్టీలో ప్రచారం సాగుతోంది.
ఈ కోటాలో మాల సామాజికవర్గం నుంచి ఎంపీ మల్లు రవి పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఆయన పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకొని క్రమశిక్షణ కమిటీకి మరొకరి పేరును పరిశీలించడంపై కూడా పీసీసీ దృష్టి పెట్టింది. ఆయనకు ఇవ్వని పక్షంలో మాదిగ సామాజికవర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ పేరును కూడా పీసీసీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇందుకే లక్కీ పోస్ట్
రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత మొదటగా చేపట్టిన పదవి ఇదే. ఆయన వర్కింగ్ ప్రెసిడెంగ్గా పనిచేసిన తర్వాతే పీసీసీ చీఫ్గా, తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నియమించిన పీసీసీ మొదటి కమిటీలో పార్టీ చీఫ్గా పొన్నాల లక్ష్మయ్యను నియమించగా, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన తర్వాత ఉత్తమ్ కమిటీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేశారు.
రేవంత్ పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత ఆయన కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి అజారుద్దీన్ పనిచేశారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారిలో సీఎంగా, పీసీసీ చీఫ్ గా, డిప్యూటీ సీఎంగా, రాష్ట్ర మంత్రులుగా కీలక పదవుల్లో ఉన్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంటేనే కాంగ్రెస్ లో ఓ సెంటిమెంట్, క్రేజ్ ఏర్పడింది.
