క్రొయేషియా, అర్జెంటీనా మధ్య తొలి సెమీస్ పోరు

క్రొయేషియా, అర్జెంటీనా మధ్య తొలి సెమీస్ పోరు

దోహా:   ఖతార్‌‌‌‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో థ్రిల్లింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఫ్యాన్స్‌‌‌‌కు కిక్కివ్వడమే కాకుండా పలువురు సూపర్‌‌‌‌ స్టార్ల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. తొలుత బ్రెజిల్‌‌‌‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో  నెయ్‌‌‌‌మార్‌‌‌‌ వెక్కివెక్కి ఏడుస్తూ  కనిపించగా.. పోర్చుగల్‌‌‌‌ ఓటమి తర్వాత లెజెండరీ ప్లేయర్‌‌‌‌ క్రిస్టియానో రొనాల్డో  కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ నెగ్గాలన్న నెయ్‌‌‌‌మార్‌‌‌‌ కలను చెదరగొట్టిన క్రొయేషియా ఇప్పుడు మరో లెజెండరీ ప్లేయర్‌‌‌‌ లియోనల్‌‌‌‌ మెస్సీకి షాక్​ ఇవ్వాలని చూస్తోంది. క్వార్టర్స్‌‌‌‌లో పోర్చుగల్‌‌‌‌ పని పట్టిన విధంగా మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా జోరుకు బ్రేకులు వేయాలని చూస్తోంది. ఇంకోవైపు ఎలాగైనా అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి తన కెరీర్‌‌‌‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని 35 ఏండ్ల మెస్సీ ఆశిస్తున్నాడు.

1986లో అర్జెంటీనాకు కప్పు అందించిన  లెజెండ్‌‌‌‌, దివంగత డీగో మారడోనా మాదిరిగానే మెస్సీ అన్నీ తానై ఈ టోర్నీలో జట్టును ఇంత దూరం తీసుకొచ్చాడు. నెదర్లాండ్స్‌‌‌‌తో క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌‌‌‌లో గట్టెక్కిన మెస్సీసేనకు సెమీస్‌‌‌‌లో క్రొయేషియా రూపంలో మరింత పెద్ద సవాల్‌‌‌‌ ఎదురవనుంది.   కేవలం 40 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా జట్టు సాకర్‌‌‌‌లో అద్భుతాలు చేస్తోంది. నాలుగేండ్ల కిందట అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఫైనల్‌‌‌‌ వరకు వచ్చిన క్రొయేషియన్లు ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తూ దూసుకొస్తున్నారు.

పలు మేటి జట్లకు చెక్‌‌‌‌ పెడుతున్నారు.  ఆ టీమ్‌‌‌‌ కీలక ఆటగాడైన లూకా మోడ్రిచ్‌‌‌‌ ఇప్పుడు వరల్డ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ సాకర్‌‌‌‌ స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. 2018లో ఫ్రాన్స్‌‌‌‌ చేతిలో ఓడి కొద్దిలో టైటిల్‌‌‌‌ చేజార్చుకున్న క్రొయేషియా ఈసారి ఎలాగైనా వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అవ్వాలన్న సంకల్పంతో ఉంది. ఈ క్రమంలో సెమీస్‌‌‌‌లో అర్జెంటీనా అడ్డుదాటి ముందుకెళ్లాలని చూస్తోంది. గత ఎడిషన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో క్రొయేషియా 3-–0తో అర్జెంటీనాను చిత్తు చేయడం గమనార్హం. 

సూపర్​ ఫామ్​లో మెస్సీ

ఆదివారం జరిగే ఫైనల్‌‌‌‌కు ఆతిథ్యం ఇచ్చే  లుసైల్‌‌‌‌  స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌ను అంచనా వేయాలని పరిస్థితి. 2014 టోర్నీ రన్నరప్‌‌‌‌ అయిన మెస్సీసేన, గత ఎడిషన్‌‌‌‌ రన్నరప్‌‌‌‌ అయిన క్రొయేషియా సమ ఉజ్జీలుగా ఉన్నాయి.  ఇరు జట్లూ సవాళ్లను ఎదుర్కొంటూ సెమీస్‌‌‌‌ వరకూ వచ్చాయి. కోపా అమెరికా చాంపియన్‌‌‌‌గా నిలిచి, వరుసగా 36 మ్యాచ్‌‌‌‌ల్లో ఓటమే లేకుండా టోర్నీకి వచ్చిన అర్జెంటీనా ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లోనే సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్నా అద్భుతంగా పుంజుకుంది.

చివరి రెండు గ్రూప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గడంతో పాటు  ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ఆస్ట్రేలియాను, క్వార్టర్స్‌‌‌‌లో డచ్‌‌‌‌ జట్టును దాటుకొచ్చింది. తన స్టార్‌‌‌‌డమ్‌‌‌‌కు తగ్గ ఆటతో  టోర్నీలో నాలుగు గోల్స్‌‌‌‌ కొట్టిన మెస్సీ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ ఆ టీమ్‌‌‌‌కు ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌. అయితే, సస్పెన్సన్‌‌‌‌ కారణంగా ఇద్దరు ప్లేయర్ల సేవలను అర్జెంటీనా ఈ మ్యాచ్‌‌‌‌లో కోల్పోయింది.  లెఫ్ట్‌‌‌‌ బ్యాక్‌‌‌‌లో మార్కోస్ అకునా, రైట్ బ్యాక్‌‌‌‌లో గోంజాలో మోంటియెల్‌‌‌‌ లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలాంశం కానుంది.  

అంతా  మోడ్రిచ్‌‌‌‌ చుట్టూనే 

గత ఎడిషన్​ మాదిరిగానే క్రొయేషియన్లు సైలెంట్‌‌‌‌ కిల్లర్స్‌‌‌‌గా ఒక్కో అడుగు వేస్తున్నారు. ప్రిక్వార్టర్స్‌‌‌‌లో జపాన్‌‌‌‌ జోరుకు చెక్‌‌‌‌ పెట్టి.. క్వార్టర్స్‌‌‌‌లో ఐదుసార్లు చాంపియన్‌‌‌‌ బ్రెజిల్‌‌‌‌ను దెబ్బకొట్టడంతో ప్లేయర్ల కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగింది. క్రొయేషియా టీమ్‌‌‌‌లో మోడ్రిచ్‌‌‌‌ కీలకం. ఈ టోర్నీలో తను ఒక్క గోల్‌‌‌‌ కూడా కొట్టలేదు. అయినా టీమ్‌‌‌‌ మొత్తం అతని చుట్టూనే తిరుగుతోంది. మిడ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌లో అంతా సవ్యంగా ఉండేలా చేయడంతో పాటు చివరి నిమిషం వరకు తోటి ప్లేయర్లంతా పోరాడేలా చేస్తున్నాడు. 2018 టోర్నీ మాదిరిగా నాకౌట్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ను ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌కు తీసుకెళ్లి ప్రత్యర్థుల పని పడుతోంది.

తమ బలమైన డిఫెన్స్‌‌‌‌నే ప్రధానంగా ఉపయోగిస్తూ  ఫలితాన్ని రాబడుతోంది.  ఆ జట్టు గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ లివకోవిచ్‌‌‌‌ ప్రత్యర్థులకు అడ్డు గోడగా నిలుస్తున్నాడు. ఇక, జపాన్‌‌‌‌  పోరుతో పోలిస్తే బ్రెజిల్‌‌‌‌పైనే క్రొయేషియా మరింత సౌకర్యవంతంగా కనిపించింది. ప్రెజర్‌‌‌‌ను బాగా హ్యాండిల్‌‌‌‌ చేస్తూ  అవకాశం వచ్చిన వెంటనే కౌంటర్‌‌‌‌ ఎటాక్స్‌‌‌‌ చేస్తోంది.  సెమీస్‌‌‌‌లో మెస్సీని కంట్రోల్‌‌‌‌ చేయడం క్రొయేషియాకు కీలకం కానుంది.  బ్రెజిల్‌‌‌‌తో పోరులో తమ డిఫెన్స్‌‌‌‌ను రక్షించిన మిడ్‌‌‌‌ఫీల్డర్ మార్సెలో బ్రోజోవిక్‌‌‌‌పై  సెమీస్​లో ఈ  బాధ్యత ఉంది.