
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో వాట్సాప్ చర్చ గొడవలకు దారితీసింది. బాన్సువాడకు కేంద్రమంత్రి అమిత్ షా వస్తున్నారని, స్థానికంగా జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోబోతున్నారని గురువారం సాయంత్రం వాట్సాప్‌లో బీజేపీకి చెందిన ఓ కార్యకర్త మెసేజ్ పెట్టారు. దానికి టీఆర్‌ఎస్ కార్యకర్త స్పందిస్తూ.. ఎవరు వచ్చినా తమను ఏం చేయరని, ఇక్కడ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతారని పోస్టు పెట్టాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఎవరి దమ్మేంటో చూసుకుందామంటూ శుక్రవారం మోస్రా బస్టాండ్ దగ్గరకు చేరుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బీజేపీ మండల మాజీ ప్రెసిడెంట్ స్వామిగౌడ్, కార్యకర్త శ్రీధర్‌కు గాయాలయ్యాయి. వారిని జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరుపార్టీల వారితో మాట్లాడి అక్కడినుంచి పంపించేశారు. గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.