లడఖ్ కోసం లడాయి.. లేహ్, కార్గిల్ టౌన్లలో వెల్లువెత్తుతున్న నిరసనలు

లడఖ్ కోసం లడాయి.. లేహ్, కార్గిల్ టౌన్లలో వెల్లువెత్తుతున్న నిరసనలు
  •  19వ రోజుకు సోనమ్ వాంగ్ చుక్ నిరాహారదీక్ష

లేహ్/కార్గిల్: హక్కుల కోసం లడఖ్ యూనియన్ టెరిటరీ లడాయీ ముమ్మరం జేసింది. లడఖ్​కు రాష్ట్ర హోదా, భూమి, ఉద్యోగాల్లో ప్రత్యేక హక్కులు ఇవ్వాలంటూ లేహ్, కార్గిల్ జిల్లాల ప్రజలు కలిసికట్టుగా కేంద్రంపై పోరాడుతున్నారు. ఇందులో భాగంగా లడఖ్​కు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరింది. పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంగా ఉన్న లడఖ్​ను, అక్కడి ప్రజలను కాపాడాలంటూ ఆయన మార్చి 6న లేహ్​లో ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు.

 ఇప్పటివరకూ ఆయనకు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు తెలిపారు. వాంగ్ చుక్​కు సంఘీభావం తెలుపుతూ ఇటు లేహ్​లోని అపెక్స్ బాడీ, అటు కార్గిల్​లోని కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ ఆధ్వర్యంలో దాదాపు 5 వేల మంది ఆదివారం నుంచి 3 రోజుల నిరాహారదీక్షను ప్రారంభించారు. నిజానికి ఈ ఉద్యమం ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్ స్టేటస్​ను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన 2019 ఆగస్ట్ 5 తర్వాత లడఖ్ ప్రజల్లో మొదలైన ఆందోళనలే క్రమంగా ఉద్యమ రూపం దాల్చాయి.  

ఆర్టికల్ 370 రద్దు తర్వాత..

ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు యూటీలుగా విభజించింది. ప్రత్యేక హోదా రద్దు కావడంతో మిగతా జమ్మూకాశ్మీర్ ప్రజల మాదిరిగానే లడఖ్ లో ఉన్న రెండు జిల్లాల(లేహ్, కార్గిల్) ప్రజల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. అప్పటివరకూ స్థానిక భూములు, ఉద్యోగాల్లో తమకు మాత్రమే హక్కులు ఉండగా.. స్పెషల్ స్టేటస్ రద్దు తర్వాత వాటన్నింటికీ తాము దూరమయ్యామన్న ఆందోళనలు తలెత్తాయి. లేహ్ లో ప్రధానంగా బుద్ధిస్టులు మెజార్టీగా ఉండగా, కార్గిల్ లో ముస్లింలు మెజార్టీగా ఉన్నారు. 

దీంతో ఉమ్మడి హక్కుల కోసం రెండు వర్గాల వారితోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ వంటి రాజకీయ పార్టీలు, స్థానిక సంఘాలు కూడా ఏకమయ్యాయి. లడఖ్ యూటీకి 6వ షెడ్యూల్ స్టేటస్ ను కల్పించాలని 2019 లో జాతీయ ఎస్టీ కమిషన్ కూడా సిఫారసు చేసింది. అప్పటి నుంచే కేంద్రం చర్చలు జరుపుతూ వస్తున్నా.. నేటికీ సఫలం కాలేదు.

ఈ నెల 6 నుంచి ఉద్యమం తీవ్రం.. 

లడఖ్ ప్రజల డిమాండ్లపై కేంద్ర హోంశాఖ ప్రతినిధుల బృందం ఈ నెల 5న కూడా చర్చలు జరిపింది. కానీ లడఖ్ ప్రజల డిమాండ్లను నెరవేర్చలేమని చేతులెత్తేసింది. రాజ్యాంగపరంగా కొంతమేర హక్కులకు రక్షణ కల్పిస్తామని తెలిపింది. రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ లో చేర్చడం వంటివి కుదరదని తేల్చిచెప్పింది. దీంతో కేంద్రం తమను మోసం చేసిందంటూ ఆ మరుసటి రోజే సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఇవీ డిమాండ్లు.. 
    లడఖ్​కు రాష్ట్ర హోదా ఇవ్వాలి
    రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం స్థానికులకు భూమి, ఉద్యోగాల్లో ప్రత్యేక హక్కులు కల్పించాలి  
    ఇకపై లేహ్​కు, కార్గిల్​కు సపరేట్​గా రెండు లోక్ సభ సీట్లు కేటాయించాలి 
    ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి

ప్రకృతికీ వోటింగ్ రైట్స్ ఉండాలి 

నేను చేపట్టిన ‘క్లైమేట్ ఫాస్ట్’ నేటికి 19వ రోజుకు చేరింది. నాతోపాటు 5 వేల మంది నిరాహారదీక్ష చేస్తున్నారు. ప్రకృతి పరిరక్షణ అంశానికి మన పార్లమెంట్లు, పాలసీ మేకింగ్ లో సరైన స్థానం లేనట్లు కనిపిస్తోంది. అయితే, నేను ఇక్కడో క్రేజీ ఐడియా చెప్పబోతున్నా. అదే ‘వోటింగ్ రైట్స్ టు నేచర్’. ఇప్పుడున్న ప్రశ్న ఏమిటంటే.. దీనిని ఏ దేశం ముందుగా స్టార్ట్ చేస్తుందనేదే. 
అది ఇండియా ఎందుకు కాకూడదూ!? 
‑ సోనమ్ వాంగ్ చుక్ (ఆదివారం ట్విట్టర్​లో)