న్యూఢిల్లీ: బస్సుల్లో, ట్రెయిన్లలో ప్యాసింజర్లు కొట్టుకోవడం మామూలు సంగతే. విమానంలో కొట్లాటలు మాత్రం అరుదు. ఫ్లైట్లలో వెళ్లేటప్పుడు చాలా మంది కోపం వచ్చినా దిగమింగుకుని, ఒకటి రెండు మాటలతోనే సరిపెట్టుకుంటుంటారు. కానీ.. వారం రోజుల కింద ఓ ఎయిర్ హోస్టెస్ కు, ప్యాసింజర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా విమానంలో ఓ ప్యాసింజర్‌ను ఇతర ప్యాసింజర్లు కొందరు ఏకంగా పిడిగుద్దులు గుద్దుతూ, చెంపదెబ్బలు కొడుతూ కొట్లాటకు దిగిన వీడియో మరింత వైరల్ అవుతోంది.
ఫస్ట్ గొడవ ఇదీ..
ఈ నెల 16న ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో ఫుడ్ విషయమై ఎయిర్ హోస్టెస్ తో ఓ వ్యక్తి గొడవపడ్డాడు.ప్లేన్‌లోకి బోర్డింగ్ పాస్ డీటైల్స్ ప్రకారమే ఫుడ్ ఐటమ్స్ వస్తాయని, కోరినట్లుగా ఇవ్వడం కుదరదని ఎయిర్ హోస్టెస్ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతను వేలు పెట్టి చూపుతూ ‘షటప్’ అని అరవడంతో ఎయిర్ హోస్టెస్ కూడా కోపంగా ‘యూ షటప్’ అని అరిచింది. తాను సర్వెంట్ నేమీ కాదని తెగేసి చెప్పింది. ఫ్లైట్ లోని ఇతర సిబ్బంది వచ్చి ఆమెను దూరం తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఇదంతా వీడియో తీసిన ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ప్యాసింజర్ దే తప్పని ఇండిగో యాజమాన్యం చెప్పింది. దీనిపై ఎంక్వైరీ చేస్తామని డీజీసీఏ వెల్లడించింది.
రెండో గొడవ ఇలా..
ఈ నెల 27న బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వచ్చిన థాయి స్మైల్ ఎయిర్ వేస్ విమానంలో జరిగింది. బ్యాంకాక్‌లో ఫ్లైట్ టేకాఫ్ కావడానికి ముందు ఇద్దరు ప్యాసింజర్లు గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ‘హాత్ నీచే కర్’ అంటూ ఓ వ్యక్తి కళ్లజోడు తీసి ఎదుటి వ్యక్తిపై చెయ్యి చేసుకున్నాడు. జుట్టు పట్టుకుని చెంపదెబ్బలు కొట్టాడు.ఇంతలో ఇతనితోపాటు మరికొందరు వ్యక్తులూ వచ్చి పిడిగుద్దులు గుద్దుతూ, చెంపదెబ్బలు కొట్టారు. ఆపై ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ సిబ్బంది వచ్చి వారిని శాంతింపచేశారని అదే ఫ్లైట్ లో వచ్చిన ప్యాసింజర్ ఒకరు వెల్లడించారు. వయెలెన్స్ తో కూడిన ఈ వీడియో వైరల్ కావడంతో గురువారం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ స్పందించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
