ఆత్మీయ సమ్మేళనాల్లో.. అసమ్మతి రాగాలు!

ఆత్మీయ సమ్మేళనాల్లో.. అసమ్మతి రాగాలు!
  •     వేర్వేరు గ్రూపులుగా కార్యక్రమాల నిర్వహణ క్యాడర్​లో అయోమయం

మెదక్ (నిజాంపేట, శివ్వంపేట), వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆదేశాల మేరకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, లీడర్లు అందరిని సమన్వయపరచి ఏకతాటిపై తెచ్చేందుకు మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కాగా జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర మెయిన్​ లీడర్లు వేర్వేరు గ్రూపులుగా కొనసాగుతున్నారు. దీంతో పాటు పలు మండలాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు,  ఇతర లీడర్లు ముఖ్య నాయకుల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఎమ్మెల్యేల పర్యటనలకు దూరంగా ఉంటున్న వారు, ఇపుడు ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు కావడం లేదు. 

మెదక్ సెగ్మెంట్​లో ...

మెదక్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి ఒక గ్రూప్​గా, ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి మరో గ్రూప్​గా సమ్మేళనాలను కొనసాగిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో కొందరు అటువైపు, మరి కొందరు ఇటు వైపు అన్నట్లు ఉంటున్నారు. ఇటీవల మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు డాక్టర్​ మైనంపల్లి రోహిత్​ ఎంట్రీతో మూడో వర్గం కూడా తయారైంది.

ఇదిలా ఉండగా ఇటీవల నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనానికి అధికార పార్టీకి చెందిన ఆ మండల జెడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్​ కుమార్ హాజరుకాలేదు. చాన్నాళ్లుగా ఆయన ఎమ్మెల్సీ సుభాష్​ రెడ్డి వర్గీయుడిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఇటీవల నిజాంపేటలో దాతల సహకారంతో టెంపరరీ బస్టాండ్​, మార్కెట్​ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

మండల కేంద్రంలో  కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం ఓ దాత భూమి విరాళం ఇచ్చినా..  నిర్మాణం చేపట్టడం లేదని,  అలాగే మార్కెట్ నిర్మాణం కోసం ఫండ్స్​ వచ్చినా పనులు జరగడం లేదని, ఈ విషయమై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆయన విమర్శించారు. హవేలి ఘనపూర్​ఎంపీపీ శేరి నారాయణరెడ్డికి సైతం ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డితో సఖ్యత లేదు. కొత్తగా ఏర్పాటైన మండలంలో కొన్ని గ్రామాలకే ఫండ్స్​ కేటాయించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇక పాపన్నపేట ఎంపీపీ చందన భర్త, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ప్రశాంత్​ రెడ్డి ఎమ్మెల్సీ సుభాష్​ రెడ్డి వెంట ఉంటున్నారు. 

నర్సాపూర్ లో..

నర్సాపూర్​ సెగ్మెంట్​లో స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్​ రెడ్డి, మాజీ మంత్రి, మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో కలిసే పాల్గొంటున్నా.. ఇంటర్నల్​గా క్యాడర్​ మాత్రం వేర్వేరు వర్గాలుగా కొనసాగుతున్నారు. వారిద్దరు పాల్గొనే కార్యక్రమాల్లో ఆయా మండలాల లీడర్లందరూ పాల్గొంటున్నప్పటికీ.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఒక్కరే పాల్గొనే కార్యక్రమాలకు సునీతారెడ్డి ఫాలోవర్స్, సునీతారెడ్డి ఒక్కరే పాల్గొనే ప్రోగ్రామ్స్​కు మదన్​ రెడ్డి ఫాలోవర్స్​హాజరు కావడం లేదు.

ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన చిలప్ చెడ్​ జడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డి ఇదివరకే పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. శివ్వంపేట జడ్పీటీసీ పబ్బ మహేష్​ గుప్తా సైతం చాలా రోజులుగా మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి  పాల్గొనే  కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మండల జనరల్ బాడీ మీటింగ్ కు సైతం ఎమ్మెల్యే వస్తే ఆయన రావడం లేదు.  మండల కేంద్రమైన శివ్వంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి పనుల బిల్లుల విషయంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు.

నియోజకవర్గంలోని ఇతర మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు సైతం పనులు కావడం లేదని, నిధులు రావడం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ పార్టీలో ఐక్యత సాధ్యమయ్యేనా అన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం 
చేస్తున్నారు.

శివ్వంపేట జెడ్పీటీసీకి ఎమ్మెల్యే బుజ్జగింపు

శివ్వంపేట జడ్పీటీసీ పబ్బ మహేశ్​గుప్తా కొన్నాళ్లుగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. అసంతృప్తి తో ఉన్న ఆయన ఎమ్మెల్యే పాల్గొనే అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. శుక్రవారం జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి  మంత్రి హరీశ్ రావు హాజరు కానున్న నేపథ్యంలో  ఎమ్మెల్యే మదన్ రెడ్డి గురువారం రాత్రి అసంతృప్తితో ఉన్న మహేశ్​ గుప్తా ఇంటికి వెళ్లి వెళ్లారు. ఆత్మీయ సమ్మేళనానికి రావాలని దాదాపు గంటపాటు బుజ్జగించారు.