వేలల్లో ఎన్ఓసీ, ల్యాండ్ రిలేటెడ్ ఫైల్స్ పెండింగ్

వేలల్లో ఎన్ఓసీ, ల్యాండ్ రిలేటెడ్ ఫైల్స్ పెండింగ్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలోని 1827 ఎకరాల వ్యవసాయ భూమిని భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఫారెస్ట్ భూముల జాబితాలో కలిపేశారు. అంతేగాక ధరణి పోర్టల్ లో ఈ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 149, 150, 154, 165, 166, 168, 200, 201, 202 203, 205ను పక్కనే ఉండే నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామంలో ఉన్నట్లు చూపారు. ధరణిలో చిన్నముప్పారం భూములుగా కనిపిస్తున్న ఈ సర్వే నంబర్లను తొలగించి నారాయణపురంలో చూపించాలని, రైతులకు కొత్త పాస్ బుక్స్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్​సీసీఎల్ఏ కు జూన్ 9న లెటర్ రాశారు. కాగా లెటర్​రాసి ఆరు నెలలు కావొస్తున్నా.. సీసీఎల్ఏ అధికారులు ఇప్పటి వరకు స్పందించిన పాపాన పోలేదు.  

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో కీలకమైన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) ఆఫీసులో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. భూ సంబంధిత ఫైళ్లతోపాటు ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్, సర్వీస్ మ్యాటర్ కు సంబంధించిన ఫైళ్లు నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్ లోనే ఉంటున్నాయి. రెవెన్యూ శాఖలో కీలకమైన సీసీఎల్ఏ పోస్టులో ఏళ్ల తరబడి ఇన్ చార్జి ఆఫీసర్లు కొనసాగడమే ఇందుకు ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైల్ ముందు కదలాలన్నా, ఎన్ఓసీ జారీ చేయాలన్నా, మెడికల్ రీయింబర్స్ మెంట్ రావాలన్నా ఎవరైనా మంత్రిగాని, లేదంటే స్వయంగా సీఎస్ గానీ సిఫార్సు చేస్తే తప్పా పని కావడం లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం ఇన్ చార్జీ సీసీఎల్ఏగా ఉన్న సీఎస్ సోమేశ్ కుమార్ రెండేళ్లుగా ఈ పోస్టులో కొనసాగుతున్నారు. ఆయనకు వీటితోపాటు రెవెన్యూ శాఖ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖలకు స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు ఉండటంతో సీసీఎల్ఏ ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్ పట్టుతప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

సీసీఎల్ఏ లేక ఆరేండ్లు.. 
రెవెన్యూ శాఖను చాలా ఏళ్లుగా ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఈ శాఖకు గుండె కాయలాంటి సీసీఎల్ఏ  పోస్టును ప్రభుత్వం ఐదేళ్లుగా ఖాళీగా పెట్టింది. భూరికార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో, రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ పరిష్కరించడంలో సీసీఎల్ఏది కీలకపాత్ర.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సీసీఎల్ఏగా సీనియర్ ఐఏఎస్ రేమండ్ పీటర్ ను నియమించగా ఆయన ఆ పోస్టులో ఏడాదిన్నర కాలం కొనసాగారు. ఆ తర్వాత సీసీఎల్ఏ పోస్టు ఖాళీగా ఉంది. రాష్ట్రంలో 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన లాంటి భారీ కార్యక్రమాన్ని కూడా సీసీఎల్ఏ లేకుండానే అమలు చేశారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇన్​చార్జి సీసీఎల్ఏగా పని చేసిన రాజేశ్ తివారిని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ సీఎస్​గా బదిలీ చేసిన ప్రభుత్వం.. 2019 ఆగస్టులో  సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్ కుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. అదే ఏడాది డిసెంబర్ 31న సోమేశ్ కుమార్ రాష్ట్ర సీఎస్ గా అపాయింట్ అయ్యారు. ఏడాది కాలంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్​గా, ఇన్​చార్జి సీసీఎల్ఏ పోస్టులోనూ ఆయనే కొనసాగుతున్నారు. వివిధ శాఖలపై సమీక్షలు, ఫైళ్ల పరిశీలనలో ఎప్పుడూ బిజీగా ఉండే సీఎస్ తమ సమస్యలు, ప్రమోషన్లపై వినతిపత్రాలు ఇచ్చేందుకు రైతులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్​మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో సీసీఎల్ఏ ఉంటే నేరుగా తమ సమస్యలను కమిషనర్ కే చెప్పుకునేవారమని, ఇప్పుడు ప్రతి పనికి సీఎస్ దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నేను వెళ్లి అడిగే వరకు లెటర్ తీయలే.. 
మా గ్రామ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్య పరిష్కారం కోసం మా జిల్లా కలెక్టర్ ఈ ఏడాది జూన్ లో సీసీఎల్ఏకు లెటర్ రాశారు. సీసీఎల్ఏ అధికారులు పట్టించుకోలేదు. మూడు రోజుల క్రితం ధరణి సబ్ కమిటీ చైర్మన్, మంత్రి హరీశ్ రావు దృష్టికి మా సమస్యను తీసుకెళ్లాం. ఆయన సీఎస్ ను ఆదేశించాక మేం సీసీఎల్ఏలో ధరణి పోర్టల్ బాధ్యతలు చూసే అధికారి వద్దకు వెళ్లాం. మేం వెళ్లి ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఇన్ వార్డు నుంచి లెటర్ తీయించారు. ఫైల్ పుటప్ చేస్తామని చెప్పి పంపారు. - దరావత్ రవి, ఎంపీటీసీ, నారాయణపురం, మహబూబాబాద్

చెల్లింపులు లేట్ 
రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారినపడితే ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) కింద ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్​మెంట్ చేయించుకునే సదుపాయం ఉంది. క్యాష్ లెస్ ట్రీట్​మెంట్ లేని హాస్పిటల్స్ లో ఉద్యోగులు ముందస్తుగా డబ్బులు చెల్లించి.. ఆ తర్వాత మెడికల్ రీయింబర్స్​మెంట్ కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇలా చాలా మంది రెవెన్యూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ట్రీట్​మెంట్ తర్వాత రీయింబర్స్ మెంట్ కు అప్లై చేసుకుంటున్నారు. కానీ సీసీఎల్ఏలో ఫైల్ పెట్టడం దగ్గరి నుంచి ఆడిట్, అప్రూవల్, డబ్బుల చెల్లింపు వరకు ఏడాదికిపైగా పడుతోంది. రెవెన్యూ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు.