రేపట్నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్లు

రేపట్నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్లు
  • ఆగస్టు 10తో ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం
  • జులై 19తో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
  • ఆగస్టు 6న పోలింగ్.. అదే రోజు ఫలితాలు
  • ఆగస్టు 11న కొత్త ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ రేపు మంగళవారం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో 16వ భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గత నెల 29న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 5న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 
రేపు మంగళవారం ప్రారంభంకానున్న నామినేషన్ల దాఖలు ప్రక్రియ జులై 19తో ముగియనుంది. దాఖలైన నామినేషన్లను 20న అధికారులు పరిశీలిస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను 22వ తేదీ వరకు ఉప సంహరించుకునే అవకాశం కల్పించారు. 
పోటీ జరిగితే ఆగస్టు 6న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఒకరికి మించిన అభ్యర్థులు పోటీలో ఉంటే ఆగస్టు 6న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తారు. ఉప రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. 233మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12మంది నామినేటెడ్ సభ్యులు, 543మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఓటుహక్కు వినియోగించుకుంటారు.