
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను సినిమా సెలబ్రిటీలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి సినీ తారలు బాగా ఆసక్తిని చూపిస్తారు. తాము ఓట్లు వేసి ప్రజలకు కూడా ఓట్లు వేయాలని ఉత్సాహపరుస్తుంటారు. కానీ పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం సెలబ్రిటీల హడావుడి కనిపించడం లేదు. చిన్న నటుల నుంచి పెద్ద స్టార్‌ల వరకు ఎవ్వరూ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. చాలా మంది తమకు ఓటు లేదనడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు చాలా మంది ఎన్‌రోల్ చేసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై సెలబ్రిటీల మేనేజర్‌లు, పీఆర్‌వోలను ఎంక్వైరీ చేయగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారని తెలిసింది.