
ఫారిన్ షూటింగ్స్, రెమ్యునరేషన్‌పై ఆరా.. ప్రొడ్యూసర్ల వివరాలూ సేకరణ
హైదరాబాద్, వెలుగు : సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి చార్మి గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. లైగర్ సినిమా షూటింగ్ కోసం మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై సెప్టెంబర్‌లో వారిపై ఈడీ కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాలని 15 రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది.ఈడీ నోటీసులతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో పూరీ జగన్నాథ్, చార్మి బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కి వెళ్లారు. ఇద్దరి బ్యాంక్ స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈడీ విచారించింది. రాత్రి 8.30 గంటల వరకు సమారు 9 గంటల పాటు ప్రశ్నించింది. ప్రధానంగా సినిమా షూటింగ్ కోసం ఇద్దరి అకౌంట్స్‌లో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిసింది. సినిమా షూటింగ్ కోసం ఫారిన్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, పెట్టుబడులు ఎవరు పెట్టారనే వివరాలు సేకరించింది. ప్రధానంగా ప్రొడ్యూసర్ల ఆర్థిక లావాదేవీలు, రెమ్యునరేషన్ చెల్లింపులపైనే ఈడీ దృష్టి పెట్టింది.
విదేశాల్లో జరిగిన షూటింగ్ సెట్టింగ్స్, అక్కడి నటులకు చెల్లించిన రెమ్యునరేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలించినట్లు సమాచారం. మూవీ కోసం తీసుకున్న బ్యాంక్ లోన్స్, ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, విదేశాలకు డబ్బును ఏ రూపంలో తరలించారనే కోణంలో ప్రశ్నించినట్లు తెలిసింది. సినిమా ప్రొడక్షన్‌లో పలువురు రాజకీయ నేతలు కూడా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం. అనుమానిత ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.