బ్లూ టిక్ కోసం ఛార్జీలకు లాస్ట్ డేట్..ఆ తర్వాత

 బ్లూ టిక్ కోసం ఛార్జీలకు లాస్ట్ డేట్..ఆ తర్వాత

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.  ట్విటర్ ఖాతాల నుండి లెగసీ బ్లూ టిక్ -‌మార్క్‌లను ప్రక్షాళన చేయడంపై  దృష్టిపెట్టిన మస్క్..బ్లూ టిక్ మార్క్ కావాలనుకున్న వారు ఏప్రిల్ 20వ తేదీలోపు ఛార్జీలు చెల్లించాలని సూచించారు.  లేదంటే ఏప్రిల్ 20 తర్వాత బ్లూ టిక్ మార్క్ కోల్పోతారని మస్క్ హెచ్చరించారు. 

ఇదే ఫైనల్..

ట్విటర్ ఖాతా ద్వారా బ్లూ టిక్  మార్క్ లను ప్రక్షాళన చేస్తున్నట్లు ఎలాన్ మస్క్  తెలిపారు. లెగసీ బ్లూ టిక్ లను ఏప్రిల్ 20న తొలగించడం జరుగుతుందని వెల్లడించాడు.  ఈ డేటే  ఫైనల్ అని... ట్వీట్‌ చేశాడు. ఏప్రిల్ 20 తర్వాత బ్లూటిక్ కోసం రుసుము చెల్లించని వారి ఖాతాలపై బ్లూ టిక్ కనిపించదని మస్క్ వెల్లడించారు. 

ఫేక్ ఖాతాలను గుర్తించి యూజర్లకు సహాయపడటానికి ట్విటర్‌ తొలిసారిగా 2009లో బ్లూ టిక్  ఖాతాలను ప్రవేశపెట్టింది. అయితే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసే వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. అయితే గతేడాది ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేశాక.. ట్విటర్ బ్లూ టిక్ కలిగిన ఉన్న వారు ఛార్జీలు చెల్లించాలన్న  విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఒకసారి గడువు ఇచ్చిన ఎలాన్ మస్క్..తాజాగా మరోసారి గడువు పెంచారు.  ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్ కోసం  రుసుము చెల్లించని వారి ఖతాలకు బ్లూ టిక్ ను మస్క్ తొలగించనున్నారు.

ట్విటర్లో బ్లూ టిక్ కోసం అమెరికాలో నెలకు 8డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. IOS, ఆండ్రాయిడ్‍ యాప్‌లో చెల్లింపు  ద్వారా నెలకు 11 డాలర్లు ఖర్చు అవుతుంది. ఈ చెల్లింపుతో బ్లూ టిక్ తో పాటు.. 30 నిమిషాల విండోలో ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం.. 4వేల అక్షరాల వరకు ఎక్కువ ట్వీట్లు, సంభాషణలలో ప్రాధాన్యతా ర్యాంకింగ్‌ల వంటి  ప్రత్యేక ఫీచర్‌లను చందాదారులు పొందుతారు.