- కొనసాగుతున్న చర్చలు
- పలు స్థానాలకు ఇద్దరు చొప్పున నామినేషన్ వేసిన ఆశావహులు
- నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
మహబూబ్‌నగర్, వెలుగు: మున్సిపల్, కార్పొరేషన్ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్పర్వం చివరి రోజుకు చేరినా.. ప్రధాన పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే టికెట్లు ఆశిస్తున్న లీడర్లు ఒక్కో డివిజన్ లో వార్డుకు ఇద్దరు చొప్పున నామినేషన్‌వేశారు. ఎవరికి పార్టీ నుంచి బీ ఫాంలు ఇవ్వాలి.. ఎవరిని కాంప్రమైజ్ చేయాలి.. కాంప్రమైజ్‌కాని లీడర్లు పక్క పార్టీల్లో చేరితే పరిస్థతి ఏమిటి..
రెబల్‌గా పోటీకి దిగితే ఎవరికి నష్టం జరుగుతుందని ఆయా పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. నామినేషన్దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో పార్టీల తరఫున పోటీ చేయించాలనుకుంటున్న వారితో నామినేషన్వేయించాలని చూస్తున్నారు. ఎంపిక చేసిన క్యాండిడేట్‌కు వ్యతిరేకంగా అదే పార్టీ చెందిన లీడర్ఎవరైనా రెబల్‌గా నామినేషన్వేస్తే వారితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలు చేస్తున్నారు.
కొలిక్కి రాని చర్చలు
కార్పొరేషన్, మున్సిపల్ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత మంగళవారం షెడ్యూల్రిలీజ్ చేసి, బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్ స్వీకరణకు గడువు ఇచ్చింది. అయితే అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీలకు సమయం లేకపోవడం పెద్ద సవాల్‌గా మారింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులైనా ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని దేవరకద్ర, భూత్పూర్, కోస్గి, మద్దూరు, మక్తల్ నారాయణపేట మున్సిపాలిటీలు, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులు, డివిజన్లకు క్యాండిడేట్లను ఖరారు చేయలేదు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు సంబంధించి బీజేపీ మొదటి విడత జాబితాను విడుదల చేసినా.. ఇంకా17 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించలేదు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఈ పార్టీల నుంచి కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు అధిక సంఖ్యలో ఉండటంతో ఎవరి పేరును ఫైనల్ చేయాలో తేల్చలేకపోతున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఆయా పార్టీలకు చెందిన జిల్లాల బాసులు, నియోజకవర్గ లీడర్లు, డివిజన్లు, వార్డుల వారీగా కేడర్‌తో సమావేశమవుతున్నారు.
పార్టీ పరంగా పోటీకి దింపాలనుకుంటున్న లీడర్లతోపాటు ఆ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులను పార్టీ ఆఫీసులకు పిలిపించి మాట్లాడుతున్నారు. మరికొందరు ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకుల నివాసాల్లో చర్చలు జరుపుతున్నారు. కానీ అవి సఫలం కావడం లేదు. దీంతో ఆశావహులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కొందరు గురువారం నామినేషన్ కూడా వేశారు. ఈ వ్యవహారాన్ని ఆయా పార్టీల జిల్లా బాసులు పార్టీల హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.
సర్వే చేయిస్తున్న కాంగ్రెస్
రెండు నెలల కిందట కాంగ్రెస్ మహబూబ్నగర్కార్పొరేషన్లో సర్వే చేయించింది. ఆయా డివిజన్లలో కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీల పరిస్థితులపై ఆరా తీసింది. అలాగే ఏ క్యాండిడేట్లకు ప్రజాబలం ఉందనే వివరాలు సేకరించింది. కొన్ని రోజుల కిందట డివిజన్ల నుంచి పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంది. దీనిపై ఇప్పటికే మూడు బృందాలు ఆయా డివిజన్ల పరిధిల్లో సర్వేలు చేస్తున్నాయి. తాజాగా మరో రెండు బృందాలు సర్వేకు దిగాయి. ఈ బృందాలు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా బీ ఫాంలు ఇవ్వనున్నారు.
43 మంది జాబితా రిలీజ్ చేసిన బీజేపీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే బీజేపీ ఒక అడుగు ముందుంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు సంబంధించి ఈ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. 43 స్థానాలకు క్యాండిడేట్ల పేర్లను ఫైనల్ చేసింది. మిగతా.. 2, 10, 15, 16, 17, 19, 28, 29, 34, 35, 39, 40, 42, 47, 52, 58, 59వ డివిజన్లకు సంబంధించిన రెండో విడత జాబితాను శుక్రవారం ప్రకటించనుంది.
నాగర్‌కర్నూల్‌లో రాజీకి ప్రయత్నాలు
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని 24 వార్డులకు కాంగ్రెస్ నుంచి 18 మంది పేర్లను ప్రకటించారు. 1, 6, 9,10,17వ వార్డులకు పోటీ పెరగడంతో అభ్యర్థుల మధ్య రాజీ కుదిర్చేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో మాజీ కౌన్సిలర్లను అడ్జస్ట్ చేసిన తర్వాత మిగతా వార్డుల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 3 వార్డులను పెండింగ్‌లో ఉంచింది.
శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో అన్ని వార్డులకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని సమాచారం. కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు కాంగ్రెస్ నుంచి 19 మందిని ప్రకటించారు. బీఆర్ఎస్ 21 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. బీజేపీ, బీఎస్పీలతో పాటు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు.
గద్వాల కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి
గద్వాల, వెలుగు: గద్వాల కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి నడుస్తోంది. మున్సిపాలిటీలో తమకంటే తమకు టికెట్లు అంటూ ఎమ్మెల్యే వర్గం, జడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలు పట్టుబడుతుండటంతో ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా పార్టీ ప్రకటించలేదు. శుక్రవారం నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. బుధవారం గాంధీభవన్ లో గద్వాల ఎమ్మెల్యే జడ్పీ మాజీ చైర్ పర్సన్ తో సపరేట్ గా చర్చించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిసింది.
మరోవైపు మొత్తం 37 వార్డులకు బీజేపీ 24 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేయగా పార్టీ ఇన్చార్జి బాబురెడ్డి జాబితా ప్రకటించారు. బీఆర్ఎస్ 17 వార్డుల అభ్యర్థుల లిస్ట్‌ను ఆ పార్టీ ఇన్చార్జి ఆంజనేయులు గౌడ్ రిలీజ్ చేశారు.
