శరద్ యాదవ్​కు ఇయ్యాల తుది వీడ్కోలు

శరద్ యాదవ్​కు ఇయ్యాల తుది వీడ్కోలు
  • ఆయన సొంతూరు మధ్యప్రదేశ్​లోని అంఖ్​మౌలో అంతిమయాత్ర

భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ నర్మదాపురం(హోషంగాబాద్) జిల్లాలోని ఆయన సొంతూరు అంఖ్‌‌‌‌‌‌‌‌మౌలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన సన్నిహితుడు గోవింద్ యాదవ్ తెలిపారు. గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. శరద్ యాదవ్ ఏడుసార్లు లోక్​సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్, ఉత్తరప్రదేశ్​లోని బదయున్, బీహార్​లోని మాధేపుర ఇలా మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఘనత శరద్​కే దక్కిందని గోవింద్ యాదవ్ గుర్తుచేసుకున్నారు.

పలువురు నేతల సంతాపం

పార్టీలకతీతంగా ముఖ్య నేతలు శుక్రవారం ఢిల్లీ ఛతర్​పూర్​లోని శరద్ యాదవ్  నివాసానికి చేరుకున్నారు. యాదవ్ భౌతికకాయం వద్ద పూలుజల్లి నివాళులర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి తదితరులు శరద్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు నివాళులర్పించారు. శరద్ మృతి దేశానికి తీరని లోటు అని అమిత్​షా విచారం వ్యక్తంచేశారు. యాదవ్​ నుంచి తాను చాలా నేర్చుకున్నానని రాహుల్ అన్నారు. ఇందిరాగాంధీ, శరద్ యాదవ్ రాజకీయ ప్రత్యర్థులే అయినా ఎప్పుడూ గౌరవంతో కూడిన సంబంధాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ భార్య సావిత్రీ సింగ్ తదితరులు యాదవ్‌‌‌‌‌‌‌‌కు నివాళులర్పించారు. శరద్ జీవితకాలం బడుగువర్గాల కోసం కొట్లాడారని జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. ఆయన జీవితం నిస్వార్థ సేవకు ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజకీయ విలువలు పాటించడంలో ఆయన ఏనాడూ రాజీపడలేదని పీడీపీ చీఫ్​ మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా, డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాంనబీ ఆజాద్.. యాదవ్ మృతికి సంతాపం తెలిపారు.