కేసీఆర్ పాలనకు తుది ఘడియలు

కేసీఆర్ పాలనకు తుది ఘడియలు

ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టినం. ఓటేసి గెలిపించిన పార్టీలు ఏం చేశాయి? ఇచ్చిన హామీలు నెరవేర్చాయా? లేదా? ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్న పార్టీలేవి? పైకి పోరాడుతూ లోపల అంటకాగుతున్న పార్టీలేవి? నిరంతరం ప్రజల్లో ఉంటూ భరోసా ఇస్తున్న పార్టీ ఏది? ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏ పార్టీకి ఓటేస్తే మనం బాగుంటాం, మన ఊరు బాగుంటుంది? తెలంగాణ సమాజం సేఫ్ గా ఉంటుందని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.  అందులో భాగంగా తెలంగాణ ప్రజలకు నరేంద్రమోడీ పాలనకు, కేసీఆర్ పాలనకు ఉన్న తేడాను గమనించాల్సిన అవసరం ఉంది.

రైతులకు, మహిళలకు అండగా మోడీ..

దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మార్కెట్ లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ తక్కువ ధరకే సబ్సిడీపై అందిస్తూ ఏటా రెండు పంటలకు కలిపి ఎకరానికి సగటున రూ.30 వేల లబ్ధి చేకూరుస్తున్నారు. గతంలో ఎమ్మెస్పీ ధర1310 రూపాయలుంటే.. ఈరోజు 1960 రూపాయలు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఏటా 6 వేల రూపాయలిస్తున్నారు.  ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తూ  37 కోట్ల 52 లక్షల మంది రైతులను ఈ బీమా పరిధిలోకి తీసుకొచ్చారు.  8 ఏళ్లలో 11 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. మహిళల వంటింటి బాధలను తీర్చేందుకు దేశంలో 12 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందించిన ఘనత మోడీజీకే దక్కింది.

జటిల సమస్యలను పరిష్కరించిన మోడీ

ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా వేగంగా జాతీయ రహదారులపై వెళుతున్నారంటే.. అది బీజేపీ పాలన చలువే. జాతీయ రహదారుల కోసం ఒక్క తెలంగాణలోనే దాదాపు లక్ష కోట్లు వెచ్చించిన ఘనత మోడీకే దక్కుతుంది. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ, కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగమేనని ప్రపంచానికి చాటిచెప్పారు. మోడీ నాయకత్వంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచి అయోధ్యలో భవ్యమైన  రామమందిరాన్ని నిర్మించుకోగలుగుతున్నాం.  కాంగ్రెస్ పాలనలో వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైతే కనీసం 20 పైసలు కూడా లబ్దిదారుడికి చేరేది కాదు.ఈరోజు డైరెక్ట్ బెన్​ఫిట్ ట్రాన్స్​ఫర్​(డీబీటీ) ద్వారా కేంద్రమిచ్చిన ప్రతిపైసా నేరుగా లబ్ది దారుడికి చేరుతుంది.

​ ప్రపంచ నాయకత్వ వరుసలో భారత్

ప్రధానమంత్రి మోడీ తీసుకొచ్చిన విదేశాంగ విధానాలవల్ల భారత్ ప్రపంచ నాయకత్వపు వరుసలో చేరిపోయింది. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యుద్ధాన్ని ఆపి భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చిన ఘనత మోడీదే. మోడీ తీసుకున్న అంతర్గత, సరిహద్దు భద్రత విధానాలు భారత్ కు ఎంతో రక్షణ కవచంగా మారాయి. ఆపద కాలంలో ప్రపంచానికి వాక్సిన్లు ఇచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. కరోనా అనంతరం అమెరికా సహా అగ్రదేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మన పొరుగునున్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు తిండికి లేక అల్లాడుతున్నాయి. మోడీ దూరదృష్టి, సంకల్పం వల్ల దేశం ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని నిలబడింది. అంతేగాకుండా అనూహ్యంగా వృద్ధి రేటు సాధిస్తూ ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలోనే భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించింది. 

కూట్లె రాయి తీయనోడు, యేట్లో రాయితీస్తడట!

రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాలు, పోడు భూములకు పట్టాలు, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు సహా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అట్టర్‌‌‌‌ ప్లాప్‌‌‌‌ అయిన కేసీఆర్.. విశాఖ ఉక్కును ఉద్దరిస్తానంటూ ప్రగల్భాలు పలికి బొక్కబోర్లపడ్డారు. దేశంలోని రైతులను బాగు చేస్తానంటూ, దేశంలోని నదులన్నింటనీ అనుసంధానిస్తూ ప్రతి ఎకరాకు నీరందిస్తానంటూ తుపాకీ రాముడి లెక్క హామీలిస్తూ జోకర్ గా మారుతున్నారు. నిజంగా కేసీఆర్ మాట మీద నిలబడేవాడే అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? నిజాం షుగర్స్‌‌‌‌, అజాం జాహి, సిర్పూర్ మిల్లులను ఎందుకు పునరుద్దరించడం లేదు? పరిశ్రమలు మూతపడి యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా ఎందుకు కళ్లు తెరవడం లేదు? కేంద్రాన్ని, ప్రధానమంత్రిని విమర్శిస్తే జాతీయ నాయకులు అయిపోతామన్న భ్రమల్లో కేసీఆర్ కుటుంబం విహరిస్తోంది.

చేవెళ్ల బహిరంగ సభ

9 ఏళ్ల మోడీ పాలన సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్ దిశగా వెళుతుంటే...  కేసీఆర్  పాలన మాత్రం సబ్ కా వినాశ్ ​దిశగా సాగుతోంది. బీఆర్ఎస్ పాలనలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలను నట్టేట ముంచి ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షలకు పైగా అప్పు భారం మోపారు. అవినీతి, కుటుంబ, నియంత పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికారం తలకెక్కి అహంకారంతో.. ప్రశ్నిస్తే సహించలేక అమాయకులను వేధిస్తున్నారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది. నిరుద్యోగులంతా ఏకమై కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన తొలి బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిన అవసరం ఉంది.  కేసీఆర్ పాలనకు తుది ఘడియలు దాపురించాయనే సంకేతమిద్దాం.అందుకోసం రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలని కోరుకునే ప్రజలంతా  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరగబోయే చేవెళ్ల బహిరంగ సభకు హాజరుకావాలని కోరుతున్నా. భారత మాతాకీ జై.

అప్పులు- ‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవినీతి- లీకులు

తెలంగాణలో ఎనిమిదిన్నరేళ్ల  కేసీఆర్ ప్రభుత్వ పాలనను ఒక్కసారి గమనించండి. నీళ్లు- నిధులు- నియామకాల నినాదంతో 1400 మంది బలిదానాలతో సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అథో:గతి పాలైంది. నీళ్లు పక్క రాష్ట్రానికి దోచిపెట్టారు. సంపన్న రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో దివాళా తీయించారు. నియామకాల ఊసే లేదు. అడప దడపా వేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి చదువుకుంటున్న నిరుద్యోగుల భవిష్యత్ ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రశ్నార్థకమైంది. మంత్రులు డమ్మీలయ్యారు. అన్ని శాఖల్లోనూ కేసీఆర్ కుటుంబానిదే పెత్తనం. ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. నయీం ఆస్తులను అప్పనంగా దోచుకున్నారనే అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డ నిండా కూరుకుపోయారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేసీఆర్ కొడుకు పాత్రను లోకమంతా కోడైకూస్తోంది. ఆశ్చర్యమేమిటంటే కేసీఆర్ కుటుంబ అవినీతిని  ప్రశ్నిస్తే మాత్రం సహించలేకపోతున్నారు. బెదిరింపులు, కేసులు,  అరెస్టులకు పాల్పడుతూ జైళ్లకు పంపుతున్నారు. నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. 

అవినీతి సొమ్ముతో దేశ రాజకీయాలు

తెలంగాణకు కేంద్రం నయాపైసా ఇవ్వడం లేదంటూ మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గత 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోందని, అందుకోసం బహిరంగ చర్చకు సిద్దమని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు సవాల్ విసిరినా.. కేసీఆర్​ చర్చకు రావడంలేదు.  కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో కనీస మర్యాద పాటించకుండా సమాఖ్య వ్యవస్థ స్పూర్తిని మంటగలుపుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినా ప్రొటోకాల్‌‌‌‌ ను పాటించకుండా తన మంత్రివర్గ సహచరులతో విమర్శలు చేయిస్తూ కుసంస్కారాన్ని బయట పెట్టుకున్నారు. దేశంలో ప్రతిపక్షనాయకుడిగా తనను బలపరిస్తే మొత్తం ఎన్నికల ఖర్చు భరిస్తానని కేసీఆర్ విపక్షాలకు ప్రతిపాదించడం చూస్తే బీఆర్ఎస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రముఖ జర్న లిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ నేటికీ స్పందించక పోవడాన్ని కూడా తెలంగాణ సమాజమంతా గమనిస్తోంది. మట్టి, ఇసుక, భూములు ఇలా తెలంగాణ వనరులను కల్వకుంట్ల కుటుంబం కొల్లగొట్టింది. ఆ అవినీతి సొమ్ముతోనే ఎన్నికలు నడపాలన్నది కేసీఆర్ ఆలోచన.
-  బండి సంజయ్ కుమార్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

‘‘పూంచ్ ఉగ్రదాడికి సంబంధించి దర్యాప్తు ప్రారంభమైంది. అధికారులు అమాయక ప్రజలపై నిందలు వేస్తారని నాకు తెలుసు. అమాయకులను అరెస్టు చేయకూడదు. వారిని బాధపెట్టడాన్ని నేను ఒప్పుకోను’’
- ఫరూక్​అబ్దుల్లా, ఎన్​సీ చీఫ్

‘‘యూపీలో ఎలాంటి అల్లర్లు లేవు. శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి. దీనికి గల కారణం చట్టం అందరినీ సమానంగా చూడటమే. ఈ విషయం అందరికీ తెలుసు. మంచి పరిపాలన ఉంటేనే ఇది సాధ్యం’’
- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం

 క్యాన్సర్  లాగే అవినీతి కూడా సమాజాన్ని పట్టిపీడిస్తున్నది. దేశ వ్యాప్తంగా పరిపాలనా సామర్థ్యాన్ని తినే స్తున్నది. ప్రాథమిక స్థాయి నుంచే అవి నీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది.  
- జస్టిస్  బీఎస్  పాటిల్, కర్నాటక లోకాయుక్త