పంచాయతీ ఓటర్ల లెక్క తేలింది.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల 23 వేల ఓటర్లు

పంచాయతీ ఓటర్ల లెక్క తేలింది.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల 23 వేల ఓటర్లు
  • సంగారెడ్డి జిల్లాలో 7,44,157 మంది
  • మెదక్ జిల్లాలో 5,23,327 మంది
  • సిద్దిపేట జిల్లాలో 6,55,958 మంది

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఓటర్ల లెక్కలు తేలాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్లు ఓటర్ల ఫైనల్ లిస్ట్​ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికార యంత్రాంగం ఓటర్ల జాబితాను ఫైనల్​ చేశాయి. మూడు జిల్లాల్లో పంచాయతీ అధికారులు తయారు చేసిన ఓటర్ల ముసాయిదాపై కలెక్టర్లు పొలిటికల్ లీడర్లతో సమావేశం నిర్వహించి .. ఆ తర్వాత అభ్యంతరాలను తీసుకున్నారు. 

వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసి ఫైనల్ లిస్ట్​ ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,613 గ్రామ పంచాయతీలు ఉండగా, 14,170 వార్డులు ఉన్నాయి. మూడు జిల్లాల్లో మొత్తం 19,23,432 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 9,41,568 మంది, మహిళలు 9,81,756 మంది. 118 మంది ఇతరులున్నారు. అయితే ఓటర్ల జాబితా జిల్లాల వారీగా పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలో 7,44,147 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 3,68,270 మంది, మహిళలు 3,75,843 మంది ఓటర్లు, ఇతరులు 44 మంది, మెదక్ లో 5,23,327 మంది ఉండగా పురుషులు 2,51,532 మంది, మహిళ ఓటర్లు 2,71,787 మంది, ఇతరులు 8 మంది, సిద్దిపేట జిల్లాలో 6,55,958 మంది ఓటర్లలో పురుషులు 3,21,766 మంది, మహిళలు 3,34,126 మంది ఉండగా, ఇతరులు 66 మంది ఓటర్లున్నారు. ఒక్కో వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున మొత్తం 14,170 పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేశారు. 

దీంతో అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసులు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు ప్రదర్శించనున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మూడు జిల్లాల డీపీఓల సమక్షంలో ఇటీవల కలెక్టర్లు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. పోలింగ్ స్టేషన్ లు, డ్రాఫ్ట్ లిస్ట్, పంచాయతీల డ్రాఫ్ట్ ఫోటోలు, వార్డుల వారీగా ఎలక్ట్రోరల్ జాబితా, ఎలక్ట్రోరల్ రూల్స్ గురించి వివరించారు. ఓటరు జాబితా సక్రమంగా సిద్ధం చేయడం, ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సక్సెస్ చేయడం, ఎన్నికల ఏర్పాట్లు, పొలిటికల్ లీడర్ల సహకారం వంటి అంశాల గురించి చర్చించి అవగాహన కల్పించారు. దీంతో ఫైనల్ ఓటరు జాబితాలో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని డీపీఓలు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం, ఫైనల్ ఎన్నికల జాబితా అధికారులు ప్రకటించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.