
రోమ్: టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు నిధులు వీలైనంత తగ్గించాలని ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అధ్యక్షుడు మసాటో కాందాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో గియోర్గెట్టికి కూడా ఆమె ఇదే విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇటలీలోని మిలన్‌లో ఏడీబీ 58వ వార్షిక సమావేశం జరిగింది. ఈ మీటింగుకు భారత్ తరఫున నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆమె ఏడీబీ అధ్యక్షుడు మసాటో కాందాను కలిశారు. పాకిస్తాన్‌కు అందించే నిధులను తగ్గించాలని కోరారు. అలాగే..ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో జియోర్జెట్టీతోనూ సమావేశమై.. పాకిస్తాన్‌కు అందుతున్న అంతర్జాతీయ నిధులను కుదించాలని విజ్ఞప్తి చేశారు.
పలు ఐరోపా దేశాల నేతలతోనూ నిర్మల చర్చలు జరిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ చర్యలకు దిగిందని..తమకు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడం, అటారీ సరిహద్దు వద్ద సరుకు రవాణాను ఆపివేయడం, 1960 ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టింది. ఈ ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (కేఎస్ఈ-100 ఇండెక్స్) 7,100 పాయింట్లకు పైగా (సుమారు 6%) క్షీణించింది.
మూడీస్ రేటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఈ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగితే పాకిస్తాన్‌కు బయటి నుంచి అందే ఆర్థిక సహాయం తగ్గనుంది. దీనివల్ల.. ఆ దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. ఐఎంఎఫ్ కార్యనిర్వాహక బోర్డు మే 9న సమావేశం కానుంది. పాకిస్తాన్‌కు ప్రస్తుతం అమలులో ఉన్న 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని సమీక్షించనుంది. ఈ సందర్భంలో భారత్ తన ఆందోళనలను మరింత గట్టిగా వ్యక్తం చేయాలని నిర్ణయించింది. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్‌కు
నిధులు తగ్గించేందుకు ప్రయత్నించనుంది.