
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో సముద్రం లేదని, శిల్పారామంలో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేసి సముద్రం లేని లోటు తీరుస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. శనివారం రాత్రి సిద్దిపేట కోమటి చెరువద్ద శిల్పారామం నిర్మాణ పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ అభివృద్ధిలో ప్రజల పాత్రే ఎక్కువుందని, చేసిన ప్రతి పనిని నిలబెట్టి ఈ ప్రాంత గౌరవాన్ని నిలబెట్టారన్నారు. నాలుగు నెలల్లో శిల్పారామాన్ని పూర్తి చేస్తామని, కోమటి చెరువు వద్ద డైనోసర్ పార్క్ త్వరలో అందుబాటులోకి రానున్నదని చెప్పారు. రంగనాయక సాగర్‌ను టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మచ్చ వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్ధిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనమని, నూకలు బుక్కమని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాత్రం రైతు శ్రేయస్సే లక్ష్యంగా ధాన్యాన్ని కొంటున్నారని స్పష్టం చేశారు. దాన్యాన్ని ఎప్పటికప్పుడు కొని లారీల ద్వారా మిల్లలకు తరలించాలని సూచించారు. రెండు రోజులలో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ
ఇచ్చారు.