
నేరడిగొండ, వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (38) తనకున్న ఎకరన్నరతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, సోయా సాగు చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులతో పాటు కుటుంబ అవసరాల కోసం కొంత అప్పు చేశాడు.
ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం దెబ్బతింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన లస్మన్న మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని చనిపోయాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.