- అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఇండియాలో 2020లో కరోనా టైంలో11.9 లక్షల మరణాలు సంభవించాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. అధికారిక లెక్కల కన్నా ఇది 8 రెట్లు ఎక్కువని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల కన్నా 1.5 రెట్లు ఎక్కువ అని ఆ అధ్యయనం పేర్కొంది. 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం ఎక్కువ అని యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 నుంచి ఈ డేటాను తీసుకున్నామని వారు వెల్లడించారు.
మహిళల ఆయుర్దాయం 3.1 సంవత్సరాలు తగ్గిపోగా.. పురుషుల ఆయుర్దాయం 2.1 సంవత్సరాలు తగ్గిందని చెప్పారు. ఆరోగ్య రంగంలో లింగ అసమానతలు, ఇండ్లలో వనరుల పంపిణీలో తేడాలు వంటి కారణాల వల్ల మహిళలు, పురుషుల్లో ఆయుర్దాయం తగ్గిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఇది భిన్నంగా ఉందని, కరోనా టైంలో ఆ దేశాల్లో మహిళల కన్నా పురుషుల ఆయుర్దాయం తగ్గిందని వివరించారు.
ఇక హిందువుల ఆయుర్దాయం 1.3 ఏండ్లు తగ్గిపోగా.. ముస్లింలలో 5.4 ఏండ్లు, ఎస్సీల ఆయుర్దాయం 4.1 సంవత్సరాలు తగ్గిపోయాయని చెప్పారు. ఆయుర్దాయం విషయంలో అణగారిన వర్గాలు, వివిధ మతాలకు చెందిన వారు ఎదుర్కొంటున్న అసమానతలను కరోనా మహమ్మారి మరింత తీవ్రం చేసిందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రీసర్చ్ ఫెలో ఆశిష్ గుప్తా తెలిపారు. ఇండియాలో వివిధ వయసున్న వారిలో మరణాలు పెరిగాయని, ముఖ్యంగా యువత, వృద్ధుల్లో మరణాలు అధికంగా సంభవించాయని ఆయన వెల్లడించారు.
