2017లో ప్రపంచవ్యాప్తంగా 90లక్షల ఫైర్ యాక్సిడెంట్లు
అగ్నిప్రమాదాల్లో బలైపోతున్నోళ్లలో మనదేశపోళ్లే ఎక్కువ మంది ఉన్నారట. ప్రపంచవ్యాప్తంగా ఫైర్ యాక్సిడెంట్లలో మరణిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు మన దేశపోళ్లేనట. 2017లో ప్రపంచమంతా 90 లక్షల ఫైర్ యాక్సిడెంట్లు జరగగా, 1.2 లక్షల మంది ఆహుతి అయ్యారని, వీరిలో 27,027 మంది ఇండియన్లే ఉన్నారట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన స్వతంత్ర పరిశోధన సంస్థ ‘ఐహెచ్ఎంఈ’ విడుదల చేసిన ‘గ్లోబల్ డిసీజ్ బర్డెన్’ అనే రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2017లో 195 దేశాల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లు, మరణాలకు సంబంధించిన గణాంకాలను, కారణాలను విశ్లేషించి, ఈ రిపోర్టును తయారు చేసింది. ఈ స్టడీ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులను సమకూర్చింది.
చైనా కంటే మనదేశంలో రెట్టింపు మృతులు
మన దేశంలో 2017లో16 లక్షల ఫైర్ యాక్సిడెంట్లు జరగగా, వాటిలో 27,027 మంది చనిపోయారని రిపోర్ట్ వెల్లడించింది. చైనాలో 10,836 మంది మాత్రమే చనిపోగా, ఇండియాలో అంతకు రెండున్నర రెట్లు ఎక్కువగా మంటలకు బలైపోయారని తెలిపింది. మొత్తం 195 దేశాల్లో ఇండియా, పాకిస్తాన్ సహా ఏడు దేశాల్లోనే సగానికి పైగా మరణాలు సంభవించాయని పేర్కొంది.
పిల్లలు, పెద్దోళ్లకే రిస్క్ ఎక్కువైంది
ఫైర్ యాక్సిడెంట్ల వల్ల ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏండ్లకు పైబడిన వృద్ధులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని నివేదిక తెలిపింది. మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లోనూ వీరికే ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది. ముంబై నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే, గతంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ మృతుల్లో 80% మంది మహిళలే ఉండేవారని, ఇప్పుడు పిల్లలు, వృద్ధులు ఎక్కువగా మంటలకు బలైపోతున్నారని ఈ స్టడీ సందర్భంగా నవీ ముంబైలోని ఐరోలీ బర్న్స్ సెంటర్ డాక్టర్ ఎస్. కేశ్వానీ చెప్పారు. చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తుండటంతో పిల్లలను ఇంట్లోని పెద్దోళ్ల దగ్గర లేదంటే చైల్డ్ కేర్ సెంటర్లలో వదిలివెళ్తున్నారని, దీంతో మంటల వల్ల సహజంగానే వీళ్ల మరణాలు పెరుగుతున్నాయని వివరించారు. అలాగే జెండర్ వయొలెన్స్ వల్ల కూడా ఇండియాలో అగ్ని ప్రమాద మరణాలు పెరుగుతున్నాయని రిపోర్ట్ తెలిపింది. కర్నాటకలో జరిపిన అధ్యయనం ప్రకారం, మహిళలు సింథటిక్ (కృత్రిమ) ఫైబర్స్ తో తయారైన చీరలు కట్టుకుంటుండం వల్ల కూడా మంటలు ఈజీగా అంటుకుని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ స్టడీలో తేలింది. ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా, బాధితులను వెంటనే హాస్పిటళ్లకు తరలించినా, అక్కడ సరైన వైద్య సౌకర్యాలు ఉండటం లేదని, ఈ కారణంగా కూడా మన దేశంలో మంటలకు బలైపోతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోందని నివేదిక వివరించింది. కాలిన గాయాలకు మంచి ట్రీట్ మెంట్ చేసేందుకు ఎక్కువ మంది వైద్య సిబ్బంది అవసరమవుతారని, కానీ మ్యాన్ పవర్ కొరత కారణంగా చాలా మందికిచికిత్స అందట్లేదని తెలిపింది.
1990 నుంచి 30% తగ్గినయ్..
మనదేశంలో ఫైర్ యాక్సిడెంట్ మృతుల సంఖ్య ఎక్కువగానే నమోదైనప్పటికీ, 1990 నుంచి 2017 మధ్య కాలంలో మృతుల సంఖ్య 30% తగ్గిందని నివేదిక తెలిపింది. కాలిన గాయాలను తగ్గించి, ప్రాణాలను కాపాడటానికే ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి మెరుగవుతుందని యూనివర్సిటీ ఆఫ్వాషింగ్టన్ సీనియర్ రీసెర్చర్ డాక్టర్ స్పెన్సర్ అన్నారు.

