స్వప్నలోక్​ అగ్ని ప్రమాదంలో పొగకు ఊపిరాడక చనిపోయారు

స్వప్నలోక్​  అగ్ని ప్రమాదంలో  పొగకు ఊపిరాడక చనిపోయారు
  • సికింద్రాబాద్​ స్వప్నలోక్​లో అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి
  • డీ బ్లాక్​ సెల్లార్​లో షార్ట్​ సర్క్యూట్​
  • వైర్లు కాలి 4, 5, 6 ఫ్లోర్లలో చెలరేగిన మంటలు
  • భయంతో రూమ్​లో దాక్కున్న ఆరుగురు ఉద్యోగులు
  • పొగకు ఊపిరాడక కన్నుమూత.. మృతుల్లో నలుగురు యువతులు
  • 4 గంటలపాటు ఎగిసిపడిన మంటలు.. ప్రమాదం టైమ్​లో బిల్డింగ్​లో 70 మంది


సికింద్రాబాద్​, వెలుగు: హైదరాబాద్​లో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్​ స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎటు చూసినా హాహాకారాలతో స్వప్నలోక్​ కాంప్లెక్స్​ పరిసరాల్లో విషాద వాతావరణం అలుముకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాంప్లెక్స్​లోని సిబ్బంది, స్థానికులు పరుగులు తీశారు. సెల్లార్​లో వైర్లు కాలి 4, 5, 6 ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. ఐదో అంతస్తులోని ఆరుగురు సిబ్బంది.. అగ్నికి తాళలేక ఓ రూమ్​లోకి వెళ్లి దాక్కున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లే సరికి.. వాళ్లంతా రూమ్​లో స్పృహ తప్పిపడిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పొగకు ఊపిరాడక చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మృతులను ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి,ప్రశాంత్​, శివగా గుర్తించారు.


వీళ్లలో ఐదుగురి వయసు 22 నుంచి 25 ఏండ్లులోపే ఉంటుంది. ఎనిమిది అంతస్తుల కాంప్లెక్స్​ స్వప్న లోక్ కాంప్లెక్స్ 8 అంతస్తుల్లో ఉంది. 1 నుంచి 5వ ఫ్లోర్ వరకు ఆఫీసులు కాగా.. 6 నుంచి 8వ ఫ్లోర్ వరకు బట్టల షాపులున్నాయి. గురువారం రాత్రి 7 గంటలకు డీ బ్లాక్ లోని రెండో సెల్లార్ లో మీటర్ స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సెల్లార్ లోనూ షాపులు నిర్వహిస్తున్నారు. షాపుల్లో పనిచేసే వారు మంటలను ఆర్పేందుకు స్విచ్ బోర్డుపై నీళ్లు పోశారు. వైరింగ్ కాలిపోయి నేరుగా 4 ఫ్లోర్  లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి 5,6వ ఫ్లోర్ కు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో 70 మందికి పైగా బిల్డింగ్ లో ఉన్నారు. అందరూ సేఫ్ గా బయటికి రాగా.. 13 మంది బిల్డింగ్​లో చిక్కుకుపోయారు. రాత్రి 7.35 గంటలకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. ఫైర్ సిబ్బంది, బల్దియా డీఆర్ఎఫ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 ఫ్లోర్ నుంచి ముగ్గురిని, టెర్రస్ పై ఉన్న ఇద్దరిని, ఆరో ఫ్లోర్ నుంచి ఇద్దరిని మొత్తం ఏడుగురిని రెస్క్యూ చేసి సేఫ్ గా తీసుకొచ్చారు. మంటలకు తాళలేక ఐదో ఫ్లోర్ లోని ఈ– కామర్స్ సంస్థ బీఎం5 ఆఫీసులో పనిచేస్తున్న వెన్నెల, ప్రమీల, త్రివేణి, శ్రావణి, శివతోపాటు మరో కంపెనీలో పనిచేస్తున్న ప్రశాంత్  ఓ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. అయితే రూమ్ లో పూర్తిగా పొగ వ్యాపించడంతో బయటకు రాలేకపోయారు. పొగతో ఊపిరి ఆడక వారు  స్పృహ కోల్పోయారు. ఆరుగురిని రెస్క్యూ టీమ్​ తమ భుజాలపై వేసుకుని ఐదో ఫ్లోర్ నుంచి కిందికి తీసుకొచ్చారు. అంబులెన్స్ లో సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంత్ ను అపోలో హాస్పిటల్ కు , మిగతా వారిని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. గాంధీ హాస్పిటల్​లో వారికి డాక్టర్లు సీపీఆర్ చేశారు. వెన్నెల, ప్రమీల, త్రివేణి, శ్రావణి, శివ ఐదుగురు గాంధీ హాస్పిటల్ లో చనిపోయారు. వీరంతా గాంధీ హాస్పిటల్​కు తీసుకొచ్చేలోగానే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అపోలో హాస్పిటల్ లో ప్రశాంత్ మృతి చెందాడు. 

మృతుల్లో ముగ్గురు వరంగల్​ జిల్లాకు చెందినవాళ్లు. ఇద్దరు మహబూబాబాద్​ జిల్లాకు చెందినవాళ్లు. మరొకరు ఖమ్మం జిల్లా వాసి. రాత్రి 11 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలానికి మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​యాదవ్​, మేయర్​ విజయలక్ష్మి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షించారు. మంటలు అదుపులోకి వచ్చాయని హోంమంత్రి మహమూద్​ అలీ తెలిపారు. ఫైర్ సిబ్బంది ప్రతి ఫ్లోర్ లో చెక్ చేస్తున్నారని, ఉదయం వరకు స్పష్టత వస్తుందని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్​లో వరుసగా అగ్నిప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. ఇటీవల డెక్కన్​ మాల్​లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.