నాంపల్లి క్రిమినల్‌‌‌‌ కోర్టులో అగ్నిప్రమాదం.. రికవరీ వస్తువులు,  కంప్యూటర్లు దగ్ధం

నాంపల్లి క్రిమినల్‌‌‌‌ కోర్టులో అగ్నిప్రమాదం.. రికవరీ వస్తువులు,  కంప్యూటర్లు దగ్ధం

అబిడ్స్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ నాంపల్లి క్రిమినల్‌‌‌‌ కోర్టు భవనంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని 6వ అదనపు చీఫ్‌‌‌‌ జ్యుడీషియల్‌‌‌‌ మేజిస్ట్రేట్‌‌‌‌ కోర్టుకు చెందిన ప్రాపర్టీ రికవరీ గదిలో మంటలు చెలరేగడంతో వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వస్తువులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 12.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన నైట్‌‌‌‌ డ్యూటీ కానిస్టేబుల్‌‌‌‌ వెంటనే కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌కు సమాచారం అందించారు.

గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో మంటలు ఇతర గదులకు వ్యాపించకుండా నిలువరించారు. అగ్నిప్రమాదంలో వివిధ క్రిమినల్‌‌‌‌ కేసులకు సంబంధించి భద్రపరిచిన వస్తువులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. నష్టం ఎంత జరిగిందనే విషయాన్ని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక విచారణలో విద్యుత్‌‌‌‌ షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.