నల్గొండ ఎఫ్‌‌‌‌సీఐ గోడౌన్‌‌‌‌లో మంటలు.. పలు కీలక ఫైళ్లు దగ్ధం

నల్గొండ ఎఫ్‌‌‌‌సీఐ గోడౌన్‌‌‌‌లో మంటలు.. పలు కీలక ఫైళ్లు దగ్ధం
  • షార్ట్ సర్క్యూటా ? ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో విచారణ

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దబండ వద్ద గల ఎఫ్‌‌‌‌సీఐ గోడౌన్‌‌‌‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేవడంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. గోడౌన్‌‌‌‌లోని స్టోర్‌‌‌‌రూమ్‌‌‌‌, కెమికల్స్‌‌‌‌ విభాగం, రికార్డుల గదిలో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే విలువైన పత్రాలన్నీ బూడిదయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రికార్డ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో మంటలు ఎగిసిపడడంతో లోపలికి వెళ్లడం ఫైర్ సిబ్బందికి కష్టతరంగా మారింది. దీంతో సిబ్బంది కిటికీలు, తలుపులను బద్దలు కొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన గదికి ఆనుకొని ఉన్న మరో గదిలో ఉన్న రసాయనాలను సిబ్బంది బయటకు తరలించారు. ప్రమాదంలో ఎఫ్‌‌‌‌సీఐకి సంబంధించిన కీలకమైన రికార్డులు, ఫైళ్లు పూర్తి స్థాయిలో కాలిపోయినట్లు తెలుస్తోంది. కాగా, అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రమాదానికి షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ కారణామా ? లేదంటే కీలకమైన రికార్డులను ధ్వంసం చేసేందుకు ఎవరైనా నిప్పు పెట్టారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన గదిలో పాత ఎలక్ట్రికల్‌‌‌‌ పరికరాలు, యూపీఎస్‌‌‌‌లు ఉన్నాయని, వీటి వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని ఎఫ్‌‌‌‌సీఐ, బీఎస్‌‌‌‌సీ, డిపో కో ఆర్డినేషన్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ సుకుమార్‌‌‌‌ అనుమానం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం వినియోగంలో ఉన్న ముఖ్యమైన పత్రాలు, రికార్డులు, ఫైళ్లు కాలిపోలేదని, అలాగే ఈ ప్రమాదం వల్ల ధాన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. డేటా, రికార్డులు మరియు ఫైళ్లు డిజిటల్‌‌‌‌ రూపంలో సురక్షితంగానే ఉన్నాయని, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.