భద్రాద్రికొత్తగూడెం/ గుండాల/ మొగుళ్లపల్లి/ కొత్తగూడ (గంగారం)/ ములుగు/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు : ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో శనివారం అగ్నిప్రమాలు జరిగి పంటలు, తోటలు దగ్ధమయ్యాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో గుగులోత్ రమేశ్‌బాబు తన ఏడెకరాల పొలంలో కొబ్బరి, మామిడి, జామ, సీతాఫలం, మామిడి తోటలు సాగు చేస్తున్నాడు. ఆపక్కనే ఉన్న పొలంలో మక్కలు తీసి, మిగిలిన పొత్తును కాల్చివేస్తున్న క్రమంలో నిప్పురవ్వలు వచ్చి పండ్లతోటలో పడ్డాయి.
దీంతో తోటతో పాటు డ్రిప్, పీవీసీ పైపులు కాలి బూడిదయ్యాయి. గుండాల మండలం సాయనపల్లి భీమునిపాదం చెరువు సమీపంలో వాగబోయిన హరిబాబుకు చెందిన ఎకరం పొలంలోని పామ్ఆయిల్ కాలిబూడిదయ్యింది. జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో రోడ్డుపై ఆరబోసిన 100 క్వింటాళ్ల మక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. రైతులు వనపర్తి మొండయ్య, నైనకంటి కృష్ణారెడ్డి, మేకల రాజ్‌కుమార్, కదుర్ల కొమురయ్యకు చెందిన పంట దగ్ధమవగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండకు చెందిన రైతులు వజ్జ జంపయ్య, చుంచ పాపయ్య, వజ్జ సారయ్యకు చెందిన 15 ఎకరాల మక్కజొన్న పంట కాలిబూడిదైంది. ములుగు జిల్లా ములుగు మండలంలోని అబ్బాపూర్కి చెందిన రైతు రాస నిర్మల తన రెండు ఎకరాల పొలంలో మిరపకాయలు ఏరి 20 బస్తాల్లో తొక్కించి పొలం వద్ద ఉంచింది. శనివారం సాయంత్రం షార్ట్ సర్య్కూట్‌తో 20 బస్తాలు కాలి బూడిదయ్యాయి. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
