
పంజాబ్ రాష్ట్రం పాటియాలా జిల్లా గురుద్వారా వద్ద ఓ వ్యక్తి మహిళపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాటియాలాలోని దుఖ్ నివారన్ సాహిబ్ లోని సరోవర్ దగ్గర పర్వీందర్కౌర్(35) అనే మహిళ మద్యం తాగుతోంది. ఆమెను చూసిన భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేనేజర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే నిర్మల్ జిత్ సింగ్సైనీ అనే నిందితుడు తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో మహిళపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో భక్తుడికి గాయాలయ్యాయి. మహిళ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అదుపులో సైనీ...
నిందితుడు సైనీ ని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు పాటియాలకు చెందిన వారని, ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గురుద్వారకి వచ్చే భక్తులను తనిఖీ చేసేందుకు భద్రత సిబ్బంది ఉండరని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.