రూ.27 కోట్ల జీఎస్టీ ఎగవేత..కంపెనీ డైరెక్టర్ ​అరెస్ట్

రూ.27 కోట్ల జీఎస్టీ ఎగవేత..కంపెనీ డైరెక్టర్ ​అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.27.07 కోట్ల జీఎస్టీని ఎగవేసిన కేసులో బిగ్​ లీప్​ టెక్నాలజీస్ అండ్​ సొల్యూషన్స్, బిగ్ ​లీప్​ హెచ్​ఆర్​ సర్వీసెస్​ సంస్థ డైరెక్టర్​వినయ్​ కోట్రాను అరెస్ట్​ చేశామని కమర్షియల్​ ట్యాక్స్​కమిషనర్​ టీకే శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట నుంచి కార్యకలాపాలు సాగించే ఈ సంస్థలు మ్యాన్​ పవర్​ సప్లయర్స్​ రంగంలో గత ఐదేళ్లుగా పని చేస్తున్నాయి. 

ఐదేళ్లుగా తమ కార్యకలాపాల పేరుతో ప్రతి నెల జీఎస్టీ రిటర్న్స్​ ఫైల్​ చేస్తూ కస్టమర్లు ఇన్​పుట్ క్రెడిట్ ట్యాక్స్​రీయింబర్స్​చేసుకునేలా వ్యవహరించాయి. కానీ జీఎస్టీ మాత్రం చెల్లించలేదు. మరోవైపు కస్టమర్లు ఇన్​పుట్​ క్రెడిట్​ట్యాక్స్​ తీసుకోవడంతో ప్రభుత్వానికి రెండు రకాలుగా నష్టం వాటిల్లింది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 – 23 ఆర్థిక సంవత్సరం వరకు రూ.27.07 కోట్ల జీఎస్టీని ఎగవేసింది. 

ఈ సంస్థలు సేవలందిస్తున్న కస్టమర్ల నుంచి ట్యాక్స్ లు వసూలు చేసుకుంటూ జీఎస్టీ ఫైలింగ్​లో మాత్రం ‘జీరో’ టర్నోవర్స్​గా పేర్కొని అక్రమాలకు పాల్పడినట్టుగా కమర్షియల్​ట్యాక్స్​డిపార్ట్​మెంట్​గుర్తించింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టిన ఈ సంస్థల డైరెక్టర్​ను అరెస్ట్ ​చేసింది.