అందరూ మహిళలే ..సింగరేణిలో తొలిసారిగా సీహెచ్పీ బాధ్యతలు

అందరూ మహిళలే ..సింగరేణిలో తొలిసారిగా సీహెచ్పీ బాధ్యతలు
  • మందమర్రి ఏరియా కేకే ఓసీపీ సీహెచ్ పీ ఎంపిక
  • కన్వేయర్ ఆపరేటర్, షెల్ పికింగ్, హెల్పర్లుగా ట్రైనింగ్ 
  • అండర్ మేనేజర్, ఇంజనీర్, సూపర్ వైజర్లతో పనులు  

కోల్​బెల్ట్​,వెలుగు :  సింగరేణిలోని మూడు బొగ్గు గనుల్లో ఒక షిప్ట్ లో అందరూ మహిళా ఉద్యోగులే విధులు నిర్వహించేలా నిర్ణయించగా.. మరోవైపు అండర్ గ్రౌండ్ తో పాటు ఓపెన్ మైన్స్ లో భారీ మెషీన్లను నడిపేందుకు మహిళా ఉద్యోగులను ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. 

ఇప్పటికే మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓపెన్ కాస్ట్  మైన్ లో తొలిసారిగా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు అంద రూ మహిళా ఉద్యోగులే చేపట్టేలా ఏర్పాట్లు కూడా చేసింది. సింగరేణిలో ప్రస్తుతం 2 వేల మందికి పైగా మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో మైనింగ్, ఎలక్ర్టికల్, మెకానికల్ ఇంజనీర్లతో పాటు సుమారు 220 మంది వరకు ఆఫీసర్లు, ఇతర హోదాల్లో సేవలు అందిస్తున్నారు. 

సంస్థ చరిత్రలోనే తొలిసారిగా.. 

 బొగ్గు రవాణాలో కీలకమైన సీహెచ్ పీలో ఒక షిప్ట్ ను కూడా మహిళలకు కేటాయించింది. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ గనిలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ బాధ్యతలను అప్పగించనుంది. ప్రస్తుతం గనిలో రోజూ 5 వేల టన్నుల బొగ్గును వెలికితీస్తూ.. 13 –16  లారీల ద్వారా ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఒక్క షిప్ట్ కు కనీసం 32 మంది మహిళా ఆఫీసర్లు, ఉద్యోగులు కావాల్సి ఉంది. 

వీరు హెడ్ ఓవర్ మెన్, జూనియర్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ర్టిషియన్, ఈపీ, డ్రిల్, కన్వేయర్, పంప్ ఆపరేటర్లు, జనరల్ అసిస్టెంట్, బంకర్  ఇన్ చార్జ్  తదితర హోదాల్లో పని చేస్తుంటారు. కాగా.. మందమర్రి ఏరియాలో 250 మంది, కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ మైన్ లో 21 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. కన్వేయర్ ఆపరేటర్, షెల్ పికింగ్,హెల్పర్లుగానూ 19 మంది శిక్షణ పొందుతుండగా.. వీరిని ఒక్క షిప్టులో డ్యూటీలు వేసేందుకు సింగరేణి ఏరియా అధికారులు నిర్ణయించారు. 

అండర్ మేనేజర్, ఒక ఇంజనీర్, ఇద్దరు సూపర్ వైజర్లను నియమించి ఒక షిప్ట్ నడిపించేందుకు అంతా రెడీ చేసింది. బెల్లంపల్లి రీజియన్ లో 11 , రామగుండం రీజియన్ 5  గనులు ఉన్నాయి. వీటి పరిధిలో కేటీకే -5, జీడీకే-11,శ్రీరాంపూర్-7 గనులను పూర్తిస్థా యిలో మహిళా ఉద్యోగులకే ఒక్కో షిప్ట్ కేటాయించి బొగ్గు ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే ఆయా గనుల్లో మహిళ ఉద్యోగులు, ఇంజనీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.  కాగా.. తక్కువ మంది కార్మికులు ఉన్న గనిని ఎంపిక చేసి  అందులో బొగ్గు ఉత్పత్తి చేసేలా కేటాయించనుంది.  

మహిళా ఉద్యోగులతో ఒక షిప్ట్ నడిపిస్తాం 

సింగరేణి సీఎండీ ఆదేశాలతో మందమర్రి ఏరియా కేకే ఓసీపీలోని సీహెచ్ పీలో ఒక్క షిప్ట్  మహిళా ఉద్యోగులతో నడిపిస్తాం. ఇక్కడ ప్రస్తుతం 21 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. అండర్ మేనేజర్, ఇంజనీర్, మరో ఇద్దరు సూపర్ వైజర్లను నియమించాం. వీరికి వెంటనే షిప్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తాం. సీహెచ్ పీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. 

మరో 25 మంది మహిళా ఉద్యోగులను సెక్యూరిటీ గార్డులుగా రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రితో పాటు ఇతర ప్రాంతాల్లో నియమించేందుకు కార్పొరేట్ నిబంధనల కోసం ఎదురుచూస్తున్నాం.  - ఎన్.రాధాకృష్ణ, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం