మ‌రో రాష్ట్రంలోకి వ్యాపించిన క‌రోనా..

మ‌రో రాష్ట్రంలోకి వ్యాపించిన క‌రోనా..
  • నాగాలాండ్ లో తొలి కేసు

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజూ వంద‌ల సంఖ్య‌లో కొత్త‌గా వైర‌స్ బారిన‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అమాతం పెర‌గ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా లేని రాష్ట్రాల్లోకి వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. నిన్నటి వ‌ర‌కు సున్నా కేసుల‌తో ప్ర‌శాంతంగా ఉన్న నాగాలాండ్ లో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్పారు. నాగాలాండ్ రాజ‌ధాని కోహిమాకు చెందిన ఓ వ్య‌క్తి క‌రోనా ల‌క్ష‌ణాల‌తో స్థానిక ఆస్ప‌త్రిలో చేరాడు. అనుమానంతో అత‌డిని అస్సాంలోని గౌహ‌తి మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ అత‌డి శాంపిల్స్ సేక‌రించి టెస్టులు చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చింది. దిమాపూర్ ప్రైవేటు ఆస్ప‌త్రి నుంచి గౌహ‌తి హాస్పిట‌ల్ కు వ‌చ్చిన అత‌డికి క‌రోనా ఉంద‌ని తేలిన విష‌యాన్ని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో తొలి క‌రోనా కేసు న‌మోదు కావ‌డంతో నాగాలాండ్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. కోహిమా స‌హా ప‌లు ప్రాంతాల‌ను మూసేసి శానిటేష‌న్ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.