జూన్ దాకా ఫస్ట్ డోస్ బంద్

జూన్ దాకా ఫస్ట్ డోస్ బంద్
  • ఈ నెలాఖరు వరకు సెకండ్ డోసే వేస్తరు
  • వ్యాక్సిన్‌‌ షార్టేజ్‌‌తో సర్కార్ నిర్ణయం
  • వచ్చే నెలలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు?
  • బుధవారం 24,415 మందికే వ్యాక్సిన్‌‌
  • కొత్తగా 4723 కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కోసం మరింత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెకండ్ డోసు వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ అని ప్రకటించిన హెల్త్ డిపార్ట్‌‌మెంట్,  మే నెలాఖరు వరకూ ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఉండడం, సెకండ్ డోసు వేయించుకోవాల్సిన వాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 

ఈ నెల చివరి వరకు 10 లక్షల మందికి కొవిషీల్డ్, 3 లక్షల మందికి కొవ్యాగ్జిన్ సెకండ్ డోసు వేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇందుకు అనుగుణంగా వ్యాక్సిన్లు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరినట్లు ఆయన చెప్పారు. ఈ నెలలో 13 లక్షల కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు వస్తేనే, ఫస్ట్ డోసు వేయగలమని ఆయన వివరించారు. మే నెలలోనూ సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వాళ్లు సుమారు 20 లక్షల మంది ఉన్నారని చెప్పారు. సెకండ్ డోసు వాళ్లకే ప్రాధాన్యతను ఇవ్వాలని కేంద్ర సర్కార్ కూడా ఇటీవల అన్ని రాష్ర్టాలకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఇస్తున్న వ్యాక్సిన్ డోసుల్లో 85 శాతం సెకండ్ డోసు వాళ్లకు, 15 శాతం ఫస్ట్ డోసు వాళ్లకు ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో జూన్‌‌ నెలలోనూ సెకండ్‌‌ డోసు వాళ్లకే ప్రాధాన్యత ఇచ్చి, ఫస్ట్ డోసు చాలా తక్కువ మందికి మాత్రమే వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు వ్యాక్సినేషన్‌‌పై లాక్‌‌డౌన్ ఎఫెక్ట్ పడింది. సగటున రోజూ 70 వేల మందికి వ్యాక్సిన్ వేస్తుండగా, బుధవారం 24,415 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. 

4723 మందికి పాజిటివ్‌‌
రాష్ర్టంలో బుధవారం 69,525 మందికి కరోనా టెస్టులు చేసినట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట ప్రకటించింది. ఇందులో 4723 మందికి పాజిటివ్ వచ్చిందని, వీటితో కలిపి కేసుల సంఖ్య 5,11,711కు పెరిగిందని పేర్కొంది. ఇందులో 4,49,744 మంది కోలుకోగా, 59,133 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నట్టు చూపించింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో కలిపి కరోనా రోగుల సంఖ్య 29 వేలకు చేరువైంది. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్‌‌పై 14,560 మంది, వెంటిలేషన్‌‌పై 8479 మంది ఉన్నారు. 5857 మంది నార్మల్‌‌ బెడ్లపై ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నారు.