జమిలి ఎన్నికలపై  23న కోవింద్​ కమిటీ భేటీ

జమిలి ఎన్నికలపై  23న కోవింద్​ కమిటీ భేటీ
  • దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిపే విషయంపై చర్చలు
  • కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా మొత్తం 8 మంది సభ్యులు
  • ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘవాల్​ హాజరు

న్యూఢిల్లీ : ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరుతో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సలహాలు, సూచనలు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​కోవింద్​ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఈ కమిటీ వేగంగా స్పందించింది. ఈ నెల 23న కమిటీ తొలి భేటీ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సాధ్యమైనంత త్వరగా జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసి, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపి కేంద్రానికి సూచనలు చేయనుంది. ఈ కమిటీకి మాజీ ప్రెసిడెంట్​ రామ్​ నాథ్ కోవింద్​నేతృత్వం వహించనుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, లోక్​సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషనర్ మాజీ చైర్మన్ ఎన్ కే సింగ్​ తదితరులు సభ్యులుగా ఉంటారు.

ALSO READ :  ఐటీ ఉద్యోగాల్లో..బెంగళూరును దాటేశాం : మంత్రి కేటీఆర్

ఈ కమిటీ లోక్ సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే విషయంలో కేంద్రానికి సూచనలు చేయనుంది. వచ్చే శనివారం జరగనున్న ఈ కమిటీ భేటీకి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్​ మేఘవాల్​ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటారు. కాగా, జమిలిఎన్నికలకు రాజ్యంగ సవరణ అవసరమా కాదా.. అవసరమైతే దానికోసం రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా.. తదితర న్యాయపరమైన చిక్కులపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. అదే సమయంలో జమిలిఎన్నికల తర్వాత హంగ్​ ఏర్పడితే ఏంచేయాలనే విషయంతోపాటు అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రభుత్వం కూలిపోయిన సందర్భంలో, ఇతరత్రా సమస్యలకు సరైన పరిష్కారం కోసం ఈ కమిటీ సూచనలు చేయనుందని సమాచారం.