- వార్డులకు 82,276
- 3న ఉపసంహరణ.. అదేరోజు అభ్యర్థుల జాబితా రిలీజ్.. 11న పోలింగ్..
హైదరాబాద్, వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలో ఉండడంతో అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో తొలివిడత నామినేషన్ల సంఖ్య ఆదివారం తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4,236 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు, 37,440 వార్డులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి.
కాగా, శనివారం ఒక్కరోజే సర్పంచ్ల కోసం 17,940, వార్డుల కోసం 70,596 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ మూడ్రోజులు కొనసాగగా.. మొదటి రెండ్రోజులు ముహూర్తాలు లేకపోవడంతో నామినేషన్లు వేయలేదు. ఆఖరిరోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. ఈ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగింది.
సూర్యాపేట జిల్లాలో అత్యధిక పోటీ
-తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో జిల్లాల వారీగా ఆసక్తికరమైన లెక్కలు బయటకొచ్చాయి. సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. వార్డు మెంబర్ స్థానాల కోసం రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి దరఖాస్తులొచ్చాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధిక పోటీ నెలకొంది. అక్కడ 159 పంచాయతీలకు గాను అత్యధికంగా 1,387 నామినేషన్లు దాఖలయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో 262 సర్పంచ్ స్థానాల కోసం1,383 నామినేషన్లు వచ్చాయి. మహబూబాబాద్ 155 పంచాయతీలకు గాను 1,239, కామారెడ్డి 167 జీపీలకు 1,224, రంగారెడ్డి174 జీపీలకు 1,169 నామినేషన్లు దాఖలయ్యాయి. పంచాయతీలు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో వార్డు మెంబర్ల నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. ఖమ్మం జిల్లా కూడా వార్డుల్లో గట్టి పోటీ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 1,530 వార్డులకు 4,540, వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు 4,379 నామినేషన్లు, ఖమ్మం జిల్లాలో 1,740 వార్డులకు 4,041, కామారెడ్డి 1,520 వార్డులకు 3,832, సూర్యాపేట1,442 వార్డులకు 3,791 నామినేషన్లు వచ్చాయి.
3న నామినేషన్ల ఉపసంహరణ.. జాబితా ప్రకటన
తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు అధికారులు ఆదివారం పరిశీలించారు. స్క్రూట్నీ చేసి అభ్యర్థుల జాబితా రూపొందించారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. తిరస్కరించిన నామినేషన్లపై సోమవారం సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు.
మంగళవారం అప్పీల్ పరిష్కరిస్తారు. బుధవారం మధ్యాహ్నం3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్యం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టును ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. కాగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. 11న తొలి విడత 4,236 పంచాయతీలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
