180 ఏళ్ల క్రితమే..మొదటి సెల్ఫీ

180 ఏళ్ల క్రితమే..మొదటి సెల్ఫీ

సెల్ఫీలు.. ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్​. 2013లో బాగా ఫేమస్​ అయిన ఆ పదానికి ఆక్స్​ఫర్డ్​ డిక్షనరీ చోటు కూడా కల్పించింది. కానీ, 180 ఏళ్ల క్రితమే సెల్ఫీ ఉందన్న సంగతి తెలుసా? జూన్​ 21ని ‘నేషనల్​ సెల్ఫీ డే’గా జరుపుకుంటారన్న విషయం తెలుసా? దాదాపు చాలా మందికి తెలిసుండదు. 1839 అక్టోబర్​లో ఫిలడెల్ఫియాకు చెందిన రాబర్ట్​ కార్నెలియస్​ అనే ఫొటోగ్రాఫర్​ తన ఇంటి పెరట్లో సెల్ఫీ తీసుకున్నాడు. అదే ఏడాది లూయిస్​ జాక్వెస్​ మాండి డాగ్వెరో అనే ఫొటోగ్రాఫర్​, సెల్ఫీలు తీసుకునే ‘డాగ్వెరోటైపీ’ని కనిపెట్టాడు. కానీ, దానికి రెండు నెలల ముందే కార్నెలియస్​ సెల్ఫీ తీసుకున్నాడు.

లైబ్రరీ ఆఫ్​ కాంగ్రెస్​ ప్రకారం రెండు లెన్సులున్న ఓ పెద్ద కెమెరా బాక్సును ముందు పెట్టి, టైమ్​ అడ్జస్ట్​ చేసి సెల్ఫీ క్లిక్​మనిపించాడట. నిజానికి అప్పట్లో లైటింగ్​ అడ్జస్ట్​మెంట్​కే కెమెరా 3 నుంచి 15 నిమిషాలు తీసుకునేదట. దాదాపు అంతసేపు కార్నెలియస్​ సెల్ఫీ కోసం పోజ్​ పెట్టి ఎదురుచూసి ఉంటాడని అంటున్నారు. ప్రస్తుతం ఫోన్​ను పట్టుకుని ముందు కెమెరాతో తమంతట తాము తీసుకునే ఫొటోను సెల్ఫీగా పిలుస్తున్నాం. కానీ, అప్పట్లో కెమెరాలు చాలా పెద్దవిగా ఉండడం వల్ల జస్ట్​ అక్కడ పెట్టి టైమింగ్​ అడ్జస్ట్​మెంట్​ ద్వారా సెల్ఫీలు తీసుకునేవారు. ఫస్ట్​ సెల్ఫీ తీసుకున్న వ్యక్తిగా కార్నెలియస్​ పేరిట గిన్నిస్​ రికార్డు కూడా ఉంది.  ఇప్పుడున్న టెక్నాలజీతో పోలిస్తే అప్పట్లోనే ఈ ఫీట్​ సాధించడం గొప్పే కదా!