
- 2 వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ పేల్చివేత
- డీఆర్డీవో సైంటిస్టులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అభినందనలు
న్యూఢిల్లీ: రక్షణ శాఖ అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా ట్రెయిన్ పై నుంచి మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ పై నుంచి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) గురువారం విజయవంతంగా ‘అగ్ని-ప్రైమ్’ మిసైల్ ప్రయోగించింది. రైలుపై నుంచి నిప్పులు కక్కుతూ.. నింగిలోకి దూసుకెళ్తున్న మిసైల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రైల్వే బేస్డ్ మిసైల్ లాంచ్ విజయవంతమైనట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్, డీఆర్డీవో అధికారులు ప్రకటించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి దీనిని ప్రయోగించారు. ఈ మిషన్ సక్సెస్ చేసినందుకు గాను డీఆర్డీవో సైంటిస్టులు, సిబ్బందికి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
రైలు నెట్‌వర్క్‌పై ముందస్తు ఏర్పాట్లు లేకుండానే ఈ క్షిపణిని.. తక్కువ టైమ్‌లో శత్రువుల కంటపడకుండా ప్రయోగించొచ్చు. కాగా, అడ్వాన్స్డ్ అగ్ని ప్రైమ్ అనే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ను తాజాగా ప్రయోగించారు.
దీని రేంజ్ 2వేల కిలో మీటర్ల వరకు ఉంది. ఇది టూ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపెల్డ్ మిస్సైల్. ఇది 11,000 కేజీల బరువు ఉంటుంది. హై ఎక్స్‌ప్లోసివ్, థర్మోబారిక్ లేదా న్యూక్లియర్ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఈ ప్రయోగంతో.. రైళ్లపై నుంచి క్షిపణులనుప్రయోగించగల సామర్థ్యం ఉన్న రష్యా, అమెరికా, చైనా దేశాలకు దీటుగా ఇండియా కూడా సత్తా చాటినట్టయింది.
దేశంలో 70 వేల కి.మీ. ట్రాక్ లు
ఇండియాలో రైల్వే నెట్వర్క్ బలంగా ఉన్నది. గతేడాది మార్చి నాటికి 70 వేల కి.మీ. ట్రాక్ ఉన్నది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశంగా ఇండియా ఉన్నది. మిసైల్స్‌ను రవాణాకు, దాచేందుకు, ప్రత్యేకంగా రూపొందించారు.
అత్యాధునిక కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, రక్షణ వ్యవస్థలను ఇందులో అమర్చారు. యుద్ధం వస్తే.. ఎక్కడి నుంచైనా మిసైల్స్‌ను లాంచ్ చేయొచ్చు. లాంచింగ్ పాయింట్లను మన సౌకర్యాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. లాంచింగ్ పాయింట్ల వద్ద టన్నెల్స్ ఉంటే.. దాచి ఉంచి.. శత్రువులపై మెరుపు దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఇక అగ్నిప్రైమ్ మిసైల్‌లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.