
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు 2025–-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) రూ.13,163 కోట్లుగా రికార్డయ్యింది. ఇది సంవత్సరం మొత్తం అంచనాలలో 0.8 శాతంగా ఉందని ప్రభుత్వం సోమవారం (జులై 01) వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరం (2024–-25) మొదటి రెండు నెలల్లో, ప్రభుత్వ ఖర్చు–ఆదాయం మధ్య అంతరం (ఆర్థిక లోటు) 2024-–25 బడ్జెట్ అంచనాలలో 3.1 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-–26) కోసం, ప్రభుత్వం ఆర్థిక లోటును జీడీపీలో 4.4 శాతంగా, అంటే రూ. 15.69 లక్షల కోట్లుగా అంచనా వేసింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) డేటా ప్రకారం, 2025 ఏప్రిల్-–మేలో ఆర్థిక లోటు రూ. 13,163 కోట్లు లేదా 2025–-26 బడ్జెట్ అంచనాలలో 0.8 శాతంగా ఉంది.
నికర పన్ను ఆదాయం రూ. 3.5 లక్షల కోట్లు, అంటే 2025–-26 బడ్జెట్ అంచనాలలో 12.4 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 12.3 శాతంగా ఉంది. మే చివరి నాటికి మొత్తం ఖర్చు రూ. 7.46 లక్షల కోట్లు, అంటే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలలో 14.7 శాతంగా రికార్డయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 12.9 శాతంగా ఉంది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు జీడీపీలో 4.8 శాతంగా నమోదైంది.