
- ఏప్రిల్, మేలో కంట్రోల్లో ఖర్చులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో ఫిస్కల్ డెఫిసిట్ ( ప్రభుత్వ ఖర్చులు, ఆదాయాలు మధ్య తేడా) బడ్జెట్‌లో వేసుకున్న అంచనాల్లో కేవలం 3 శాతంగా నమోదయ్యింది. ఏప్రిల్, మేలో లోక్ సభ ఎన్నికలు జరగడంతో ప్రభుత్వం ఖర్చులు కంట్రోల్లో ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌లో అప్పటి బడ్జెట్ అంచనాల్లో ఫిస్కల్ డెఫిసిట్ 11.8 శాతంగా రికార్డయ్యింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 5.1 శాతం లేదా రూ.16,85,494 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీన్ని 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి తగ్గించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్స్ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్, మే నెలలో ఫిస్కల్ డెఫిసిట్ రూ.50,615 కోట్లుగా నమోదయ్యింది. కిందటి రెండు నెలల్లో రూ.5.72,845 కోట్ల రెవెన్యూ రిసీట్స్‌ను ప్రభుత్వం అందుకుంది. ఇదే టైమ్‌లో ప్రభుత్వ ఖర్చులు రూ.6.23 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. .
ప్రజల నుంచి సేకరించిన అప్పులే ఎక్కువ
ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు (గ్రాస్ లెవెల్‌లో) రూ.171.78 లక్షల కోట్లకు పెరిగాయి. కిందటేడాది డిసెంబర్ నాటికి ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రభుత్వ అప్పులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం 3.4 శాతం పెరిగాయి. గ్రాస్ డెట్‌లో 90.2 శాతం పబ్లిక్ నుంచి సేకరించినవే ఉన్నాయి. అంటే బాండ్లు, సెక్యూరిటీలు అమ్మడం ద్వారా సేకరించిన అప్పులు.
‘ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీలో 5.1 శాతంగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీన్ని 2025–26 లో జీడీపీలో 4.5 శాతానికి తగ్గించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రభుత్వం అప్పులు తీసుకోవడాన్ని తగ్గించుకోవాలని ప్లాన్ చేయడంతో ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్‌లో ఇండియా బాండ్లపై ఈల్డ్స్ తగ్గాయి’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఇన్‌ఫ్లేషన్ తగ్గించేందుకు ఫెడ్ తీసుకుంటున్న చర్యల వలన యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్‌లో వోలటాలిటీ కనిపించిందని పేర్కొంది. ఇండియా బాండ్ ఈల్డ్స్ నిలకడగా ఉన్నాయని తెలిపింది.