చేప పిల్లలు ఎక్కడ?.. గతంలో పంపిణీ చేసిన వాటికి లెక్కల్లేవ్

చేప పిల్లలు ఎక్కడ?..  గతంలో పంపిణీ చేసిన వాటికి లెక్కల్లేవ్
  • లేని చెరువుల్లో చేప పిల్లలు వదిలినట్లు లెక్కలు
  • రికార్డుల మాయమైనట్లు పోలీసులకు ఫిషరీస్​ ఏడీ ఫిర్యాదు
  • తమ వద్ద ఉన్నాయంటున్న మత్స్యకార సంఘం నేతలు

నాగర్ కర్నూల్, వెలుగు: జిల్లాలోని చెరువుల్లో గతేడాది వరకు వదిలిన చేపపిల్లల లెక్కలకు పొంతన కుదరడం లేదు. చెరువుల్లో వదిలిన చేపపిల్లల లెక్కలకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయని ఫిషరీస్  ఏడీ పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్  చేయగా, రికార్డులు తమ దగ్గరే ఉన్నాయంటూ జిల్లా మత్స్యకార సంఘాల సభ్యులు చెబుతున్నారు. లేని చెరువుల్లో చేపపిల్లలు వదిలి దొంగ లెక్కలు తయారు చేయడమే కాకుండా, ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

జిల్లాలో 1056 చెరువులు..

జిల్లాలో మొత్తం 1056 చెరువులు ఉన్నాయి. ఏటా ప్రభుత్వం చెరువులతో పాటు కేఎల్ఐ రిజర్వాయర్లు, కృష్ణా బ్యాక్​ వాటర్​లో 2 నుంచి 2.50 కోట్ల చేప పిల్లలను ఫిషరీస్​ డిపార్ట్​మెంట్ ద్వారా మత్స్యకారులకు పంపిణీ చేస్తుంది. చేపపిల్లల సరఫరా, పంపిణీ, చెరువులు, ఖర్చు వివరాల రికార్డులు జిల్లా మత్స్య​శాఖ, ఫిషరీస్​​డెవలప్​మెంట్ బోర్డు, మత్స్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. 

జిల్లా ఫిషరీస్​ ఆఫీస్​లో ఉండాల్సిన రికార్డులు, ఫైళ్లు మాయమయ్యాయని ఫిషరీస్​ ఏడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని 235 మత్స్యకార సహకార సంఘాలు, జిల్లా మత్స్య పరిశ్రమ సహకార సంఘాల రికార్డులు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అన్నీ దొంగ లెక్కలే..

మత్స్యకారులకు ఉపాధి కలిగించేలా ప్రభుత్వం ఏటా కోట్ల సంఖ్యలో చేపపిల్లలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంటే కింది స్థాయిలో అడ్డగోలుగా దొంగ లెక్కలు రాస్తున్నారనే ఆరోపణలున్నాయి. టెండర్​ టైంలో చేపపిల్లల క్వాలిటీ మొదలుకుని, వాటి సంఖ్య విషయంలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. లేని చెరువులను సృష్టించి అందులో చేపపిల్లలను వదిలినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. ఇదంతా జిల్లా ఫిషరీస్​ డిపార్ట్​మెంట్, మత్సకార సహకార సంఘాల కన్నుసన్నల్లో జరిగినా, ఈ మధ్య తలెత్తిన విబేధాలతో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

 చెరువుల లీజు పునరుద్ధరణ, మత్స్యకారులకు కొత్త సభ్యత్వాలు, ఇన్సూరెన్స్​ క్లెయిమ్, సెటిల్​మెంట్​దందాలు జరిగినా మత్య్సకారులు దీనిపై నోరు విప్పేందుకు భయపడుతున్నారు. స్థానిక మత్స్యకారుల ఉపాధికి గండికొట్టేలా ఇతర ప్రాంతాల వారికి సబ్  లీజ్  ఇచ్చుకుంటున్నా అడ్డుపడిన దాఖలాలు తక్కువే. మత్స్యశాఖలో అవినీతి జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని 
అంటున్నారు. 

అన్ని రికార్డులు ఉన్నయ్..

గత ఏడాది చెరువుల్లో వదిలిన చేపపిల్లల వివరాలు, తీర్మానాలు, క్యాష్​ బుక్​ అన్నీ తమ వద్దే ఉన్నాయని జిల్లా మత్స్యకార సంఘాల సభ్యులు చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న రికార్డులు మాయమయ్యాయని ఫిషరీస్  ఏడీ చెప్పడం సరైంది కాదని అంటున్నారు. ఫిషరీస్  డిపార్ట్​మెంట్​ అధికారులు రికార్డుల్లో పేర్కొన్న విధంగా చేపపిల్లల పంపిణీ చేయలేదని ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల సభ్యత్వాలకు సంబంధించిన డబ్బు జాయింట్  అకౌంట్​లో ఉందని వారు వివరించారు.