గండిపేట, ట్యాంక్‌బండ్, వెలుగు: చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అయినా ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా తెలంగాణ మత్య్సశాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కోడి, మేక కూరకు రేట్లు పెరుగుతున్నాయని, చేపల రేట్లు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. మత్స్య రంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఆయన మత్స్య శాఖ కార్యాలయంలో ఉత్తమ మత్స్యకార ప్రతిభ అవార్డులను అందజేశారు.
కులవృత్తి రక్షణ చట్టం తేవాలి
గంగపుత్రుల కుల వృత్తి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని గంగ పుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్ డిమాండ్ చేశారు. మత్స్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కైరంకొండ నర్సింగ్, పూస సత్యనారాయణ, సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
