
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి తాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గ్రామ మత్స్యకారుల సంఘం సభ్యులు కోరారు. సోమవారం కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. తాగునీటి జల సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహులు, సంఘం ప్రెసిడెంట్ సుదర్శన్ మాట్లాడుతూ ఈదులనాగులపల్లి గ్రామంలోని తాళ్ల చెరువు కట్టను ఆనుకొని ఇష్టానుసారం వెంచర్లు వేస్తున్నారని, అభివృద్ధి పేరుతో చెరువు ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నాలు జరుతున్నాయని ఆరోపించారు.
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి కొన్ని నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయని దీనివల్ల మత్స్యకారులు జీవనోపాది కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి చెరువు హద్దు బంధులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, మత్స్యకారుల కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు లక్ష్మణ్, మల్లేశ్, కృష్ణ ఉన్నారు.