చేప పిల్లలా.. నగదు బదిలీనా .. టెండర్ ద్వారా పంపిణీ వద్దంటున్న మత్స్యకార సొసైటీలు

 చేప పిల్లలా.. నగదు బదిలీనా .. టెండర్ ద్వారా పంపిణీ వద్దంటున్న మత్స్యకార సొసైటీలు
  • క్వాలిటీ లేని చేప విత్తనాలు సప్లై చేస్తుండడంతో నష్టపోతున్న వైనం 
  • నేరుగా నగదు చేస్తే తామే కొనుక్కుంటామంటున్న మత్స్యకారులు 
  • చేప పిల్లల సరఫరాకు ఇంకా టెండర్లు ఖరారు చేయని సర్కార్ 

మెదక్/సిద్దిపేట, వెలుగు:  రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేపల పెంపకానికి, టెండర్ పద్ధతిలో విత్తన పంపిణీ చేయకుండా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు(సొసైటీ)కు ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేప విత్తన పంపిణీ టెండర్​దక్కించుకునే కాంట్రాక్టర్లు, చేప విత్తన సైజు, నాణ్యత, సంఖ్య విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో తాము నష్టపోతున్నామంటు న్నారు. కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం కంటే నేరుగా సొసైటీల ఖాతాలకే నగదు బదిలీ చేస్తే ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉంటుందంటున్నారు. తద్వారా మత్స్యకారులు తమకు అవసరమైన మేర నాణ్యమైన చేప విత్తనాలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 

గతేడాది పలుమార్లు టెండర్లు పిలిచినా..

రాష్ట్రంలో 32 జిల్లాల్లో 5,969 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సొసైటీల్లో మొత్తం 4,11,300 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. 26,357 చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్ట్​ల్లో చేపల పెంపకం చేపడుతున్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద సాగునీటి వనరుల్లో పెంపకానికి సుమారు 90 కోట్ల చేప పిల్లలను అందిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన చేప పిల్లలకు చెందిన బకాయిలు పెద్ద మొత్తంలో ఇంకా చెల్లించలేదు. దీంతో గతేడాది పలుమార్లు టెండర్లు పిలిచినప్పటికీ చాలా జిల్లాలకు చేప పిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ కారణంగా చేప పిల్లల విడుదలలోనూ జాప్యం ఏర్పడింది. టెండర్ల ఖరారు ఆలస్యమైన కారణంగా గతేడాది జూన్​, జులై లో పంపిణీ కావాల్సిన చేప పిల్లలు అక్టోబర్​వరకు అందించారు. 

ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

ఈ ఏడాది చేపల పెంపకం సీజన్​మొదలైంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఉచిత చేప విత్తన సరఫరాకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మత్స్యశాఖ అధికారులు జిల్లాల వారీగా చేపల పెంపకానికి అనువైన చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్ట్​లు ఎన్ని ఉన్నాయి..? ఆయా వనరుల్లో పెంపకానికి ఎన్ని చేప పిల్లలు అవసరమనేది గుర్తించాలి. అనంతరం ఉన్నతాధికారులకు ఇండెంట్​పంపిస్తే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. జూలై నెల వచ్చినప్పటికీ ఇంతవరకు చేప పిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఈసారి ఉచిత చేప పిల్లల సరఫరా ఉంటుందా? ఉండదా? అని మత్స్య సహకార సంఘాలు సందేహాలు వ్యక్తం 
చేస్తున్నాయి. 

నగదు బదిలీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్

చేప పిల్లల సరఫరా కాంట్రాక్టర్లకు అప్పగించకుండా సొసైటీలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కొన్నేండ్లుగా డిమాండ్​చేస్తున్నారు. టెండర్​ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తే చెరువుల్లో పోయాల్సిన చేప పిల్లలను పోయడం లేదు. సైజు విషయంలోనూ తేడాలు ఉంటున్నాయి. దీంతో తాము నష్టపోతున్నామని మత్స్యకారులు అంటున్నారు. అయితే.. చేప పిల్లలకు బదులుగా సొసైటీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తే తామే అవసరమైనన్ని నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామంటున్నారు. ఈ సీజన్​నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సొసైటీ ఖాతాలో డబ్బులు జమ చేయాలి

కాంట్రాక్టర్ల ద్వారా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసే బదులు, ఆ సొసైటీ పరిధిలోని చెరువులు, కుంటల్లో ఎంత మొత్తంలో చేప పిల్లలు పోస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం సొసైటీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలి. అలా చేస్తే  మేమే చెరువులు, కుంటలు నిండగానే మంచి నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసి పోసుకుంటాం. 

కొత్తోళ్ల స్వామి,  సొసైటీ సెక్రటరీ, చల్మెడ   

కాంట్రాక్ట్​ సిస్టమ్ బంద్​ పెట్టాలి 

పోయినేడాది టెండర్లు జల్ది కాకపోవడంతో జిల్లాలో చేప పిల్లల సప్లై మస్తు లేట్ అయింది. చెరువుల్లో సీడ్​లేట్​గా పోస్తే చేపలు సరిగా పెరగక నష్టపోతం. కాంట్రాక్ట్​ సిస్టమ్ బంద్​ పెడితేనే బాగుంటది. ఈ ఏడాదైనా చేప పిల్లలు త్వరగా సప్లై అయేట్టటు చూడాలి.  

పోచయ్య, మత్స్యకారుడు, బచ్చురాజ్ పల్లి, మెదక్ జిల్లా