ఫిట్​మెంట్ జస్ట్​ 7.5 శాతమే.. మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

ఫిట్​మెంట్ జస్ట్​ 7.5 శాతమే.. మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

హెచ్​ఆర్​ఏలోనూ కోతలు పెట్టిన పీఆర్సీ

ఇప్పటివరకు హెచ్​ఆర్​ఏ: 30%,  20%, 14.5%, 12%

కమిషన్​ కొత్త సిఫార్సులు: 24%, 17%, 13 %, 11%

సీపీఎస్ ఎంప్లాయీస్​ జీతంలో పెన్షన్​ వాటా కింద  14 శాతం కట్​

మినిమం శాలరీ  రూ. 19 వేలు, మ్యాగ్జిమం శాలరీ 1.62 లక్షలు

రిటైర్​మెంట్​ గ్రాట్యుటీ రూ.16 లక్షలు

చైల్డ్​ కేర్​ లీవ్స్​​ 120 రోజులు.. కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాల పెంపు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని పీఆర్సీ కమిషన్​ రికమెండ్​ చేసింది. హౌస్​ రెంట్​ అలవెన్స్​ (హెచ్​ఆర్​ఏ)లోనూ భారీగా కోతలు పెట్టింది. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగుల జీతాల నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్​ ఫండ్​ కోసం అదనంగా మరో 4 శాతం  కట్​ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే ఇది 10 శాతంగా ఉంది. ఉద్యోగుల రిటైర్​మెంట్​ ఏజ్​ను 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని సిఫార్సు చేసింది. కనీసం 30 శాతానికి మించి ఫిట్​మెంట్​ ఉంటుందని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఆశించగా.. కమిషన్​ మాత్రం అతి తక్కువ శాతం ఫిట్​మెంట్​ రికమెండ్​ చేయడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 మే 18న రిటైర్డ్​ ఐఏఎస్ సీఆర్ బిశ్వాల్ చైర్మన్​గా ఉమా మహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్  సభ్యులుగా తొలి పీఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 31 నెలల పాటు స్టడీ చేసి గత  డిసెంబర్​ 31న  కమిషన్​ తమ  రిపోర్టును ప్రభుత్వానికి అందించింది. బుధవారం ఉదయం కమిషన్​ సిఫార్సులను ప్రభుత్వం 13 గుర్తింపు సంఘాలకు అందించింది.  సీఎస్  సోమేశ్ కుమార్  ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సాయంత్రం బీఆర్కే భవన్ లో టీఎన్జీవో, టీజీవో, సెక్రటేరియట్​ ఎంప్లాయీస్​ యూనియన్​ ప్రతినిధులతో చర్చలు జరిపింది. మిగతా సంఘాల ప్రతినిధులను గురు, శుక్ర వారాల్లో చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వానికి కమిషన్​ చేసిన సిఫార్సులను చూసి ఉద్యోగులు షాక్​కు గురయ్యారు.

సీపీఎస్ ఉద్యోగుల జీతాల్లో  4 శాతం కటింగ్​

కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ను రద్దుచేసి, పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ కమిషన్ మాత్రం సీపీఎస్ ఎంప్లాయీస్ జీతాల్లో మరింత కోతలు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్​ ఫండ్​ కింద  ప్రస్తుతం ఉద్యోగుల వాటాగా జీతంలో 10 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టి, దాన్ని ఎంప్లాయ్ రిటైర్ అయ్యే సమయానికి రిటైర్మెంట్​ బెనిఫిట్స్​గా అందిస్తున్నారు. కానీ కమిషన్ ప్రస్తుతం ఉద్యోగుల వాటాగా జీతంలో 14 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టాలని తెలిపింది.  సీపీఎస్  ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా పెన్షన్ అందించాలని సూచించింది. రిటైర్డ్​ సీపీఎస్ ఉద్యోగులకు కూడా పాత పింఛన్ విధానం వర్తించే ఉద్యోగుల తరహాలో డెత్ రిలీఫ్ ఇవ్వాలని సూచించింది.

రిటైర్మెంట్​ ఏజ్​ 60 ఏండ్లు

ఉద్యోగుల రిటైర్మెంట్​ ఏజ్​ను 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని కమిషన్​ రికమెండ్ చేసింది. ప్రస్తుతం అమలవుతున్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ పదవీ విరమణ వయస్సును 60 ఏండ్లుగా కొనసాగించాలని సూచించింది.

కనీస వేతనం పెంపు

ప్రస్తుతం కనీస జీతం రూ. 13 వేలుగా ఉంటే పీఆర్సీ రూ. 19 వేలకు పెంచాలని సూచించింది. అలాగే గరిష్ట జీతాన్ని రూ. 1,62,700గా నిర్ణయించింది. గ్రాట్యుటీని రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంచుతూ సిఫారసు చేసింది.

చైల్డ్​ కేర్​ లీవ్స్​​ 120 రోజులు

చైల్డ్ కేర్ లీవ్ ను 90 నుంచి 120 రోజులకు పెంచాలని కమిషన్​ సూచించింది. డిజేబుల్ చిల్డ్రన్​ ఉన్న ఎంప్లాయీస్ కు రెండేండ్లు లీవ్ ఇవ్వాలంది. పిల్లలకు మేల్  పేరెంట్ మాత్రమే ఉంటే వారికి కూడా చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని తెలిపింది. ఏటా ట్రావెల్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే.. సర్వీస్ కాలంలో కేవలం నాలుగు సార్లు దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.  బ్లాకు పీరియడ్ అయిన నాలుగేండ్లలో ఒకసారి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు

కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచాలని కమిషన్​ రికమెండ్ చేసింది. రెగ్యులర్ రిక్రూట్మెంట్​లో కాంట్రాక్టు లెక్చరర్లకు వెయిటేజ్ ఇవ్వాలని తెలిపింది. పుల్ టైమ్, పార్ట్ టైమ్ గా పనిచేస్తున్న ఎంప్లాయీస్ కు సెలవులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేయాలని పేర్కొంది. అదేవిధంగా ఇతర డిపార్ట్​మెంట్లలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్  పద్ధతిలో పనిచేసే ఫోర్త్​ క్లాస్, థర్డ్​ క్లాస్​ ఎంప్లాయీస్​కు  ఏటా రూ. 1,000 జీతం పెంచాలని సూచించింది.

రిటైర్​ అయిన 20 ఏండ్ల తర్వాత పూర్తి పెన్షన్​

మినిమం పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రూ. 9,700 గా కమిషన్​ నిర్ణయించింది. ఉద్యోగి రిటైరయ్యాక 20 ఏండ్ల తర్వాత పూర్తి పెన్షన్ ఇవ్వాలంది. పట్టణాల్లో పని చేసే ఉద్యోగులకు వారి  పే స్కేల్ ప్రకారం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌‌ ఇవ్వాలని,  ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు బ్యాంకుల నుంచి వడ్డీరేట్లలో సబ్సిడీలను ఉపయోగించుకొని ఇల్లు, ఇతర లోన్లు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించింది.

ఇంతే చాలు!

రాష్ట్ర తొలి పీఆర్సీపై ఎంప్లాయీస్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పెరిగిన ధరలు, జీవన ప్రమాణాల దృష్ట్యా ప్రస్తుత బేసిక్​ శాలరీపై 43 నుంచి 80 శాతం జీతాలు పెంచాలని ఉద్యోగ వర్గాలు పీఆర్సీని కోరాయి. కానీ ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఫిట్​మెంట్​ను కమిషన్ సిఫార్సు చేస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వం చేసే రెవెన్యూ ఖర్చుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 38 శాతం కేటాయిస్తోందని పేర్కొంది. బేసిక్​ శాలరీ పై 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని తన రిపోర్టులో కమిషన్​ స్పష్టం చేసింది. 7.5 శాతం ఫిట్​మెంట్  పెంపుతో  ఏటా ఖజానాపై రూ. 2,252 కోట్ల భారం పడుతుందని, జీతాల పెంపును 2018 జులై 1 నుంచి అమలు చేయాలని సూచించింది.

కిరాయి అలవెన్స్​లోనూ కోత

పీఆర్సీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తే జీతాలు పెరగడం కంటే తగ్గే చాన్స్ ఉంది. ఇంటి కిరాయి అలవెన్స్​ను తగ్గించడడంతో శాలరీలో కోత పడే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు ఇంటి కిరాయిలు పెరిగిపోతుంటే.. కమిషన్​ మాత్రం హౌస్​ రెంట్​ అలవెన్స్​ (హెచ్ఆర్ ఏ)ను కుదించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న  30 శాతం, 20 శాతం, 14.5 శాతం, 12 శాతం ఉన్న హెచ్ఆర్ఏను.. 24 శాతం, 17 శాతం, 13 శాతం, 11 శాతంగా సిఫారసు చేసింది. జీహెచ్​ఎంసీ  పరిధిలోని ఉద్యోగులకు ఇప్పటివరకు బేసిక్​ శాలరీలో 30 శాతం  హెచ్​ఆర్​ఏను ఇచ్చేవాళ్లు. ఇప్పుడు వారికి 24 శాతం మాత్రమే ఇవ్వాలని కమిషన్​ సిఫార్సు చేసింది.

ఇతర సిఫార్సులు

ఉద్యోగులకు ఈహెచ్‌‌ఎస్‌‌ (ఎంప్లాయీస్​ హెల్త్​ స్కీం)లో భాగంగా క్యాష్‌‌లెస్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ అందించాలి. ఇందుకోసం ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్‌‌  పే నుంచి ఒక శాతం కట్​ చేయాలి.

రిటైర్డ్‌‌ సీపీఎస్‌‌ ఉద్యోగులకూ ఈహెచ్‌‌ఎస్‌‌ వర్తింపజేయాలి. వారి ఒక నెల పెన్షన్‌‌కు సమానమైన మొత్తాన్ని ఒకేసారి వారి నుంచి వసూలు చేసి ఈ స్కీం కింద క్యాష్​ లెస్​ ట్రీట్​మెంట్​ అందించాలి.

సర్వీస్‌‌ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు నెలకు ఇచ్చే మెడికల్‌‌ అలవెన్స్‌‌ను రూ. 350 నుంచి రూ.600కు పెంచాలి.

ప్రొటోకాల్‌‌ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు బేసిక్‌‌ పేలో 15 శాతం స్పెషల్‌‌ పే వర్తింపజేయాలి. ఉద్యోగుల పే స్కేలుకు తగ్గట్టుగా వారికి స్పెషల్‌‌ పే పెంచాలి.

ప్రభుత్వ స్కూళ్లలో ఇద్దరు పిల్లలను చదివించే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి ఒక్కో స్టూడెంట్​ కోసం  రూ. 2 వేల చొప్పున ట్యూషన్‌‌ ఫీజు చెల్లించాలి. గతంలో ఎన్‌‌జీవోలకు మాత్రమే ఈ స్కీం వర్తింపజేయగా.. ఇప్పుడు అందరు ఉద్యోగులకు వర్తింపజేయాలి.

ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే ఖర్చును రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు  పెంచాలి. సర్వీస్‌‌, ఫ్యామిలీ పెన్షనర్లకు చెల్లించే మొత్తాన్ని రూ. 30 వేలకు  పెంచాలి.

షెడ్యూల్డ్‌‌ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే స్పెషల్‌‌  కాంపెన్సేటరీ అలవెన్స్‌‌ 30 శాతానికి పెంచాలి. నెలకు గరిష్టంగా రూ. 1,660 చెల్లించాలి.

దృష్టిలోపం ఉన్న టీచర్లు, లెక్చరర్లకు ఇచ్చే రీడర్స్‌‌ అలవెన్స్‌‌ను 30 శాతానికి పెంచాలి. గరిష్టంగా నెలకు రూ.2,500 చెల్లించాలి.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో పనిచేసే ఉద్యోగులకిచ్చే ఢిల్లీ అలవెన్స్‌‌ను బేసిక్‌‌ పేలో 20 శాతానికి పెంచాలి. వారికి గరిష్టంగా రూ.5,500 చెల్లించాలి.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో పనిచేసే డ్రైవర్లకు గంటకు రూ. 40 చొప్పున గరిష్టంగా వంద గంటలకు స్పెషల్‌‌ గ్రాట్యుటీ అలవెన్స్‌‌ చెల్లించాలి.

For More News..

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 1,91,126.. పీఆర్సీ రిపోర్ట్‌‌లో వెల్లడి